ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం… వచ్చినవాళ్లందరికీ కాఫీలు స్నాక్స్ ఏర్పాటు చేయడం.. టీవీ కెమెరాలు వచ్చాయో లేదో లెక్క చూసుకోవడం.. ఆ వెంటనే తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన వారి మీద ఎడాపెడా విమర్శలు చేసేయడం, అలవిమాలిన ఆత్మస్తుతి.. పరనింద! రాజకీయ నాయకులు నిత్య జీవితాలు ఇదే విధంగా తయారైపోయాయి. ఇందుకు ఏ పార్టీ కూడా అతీతం కాదు. అందరూ ఒక తాను ముక్కలే. దానికితోడు.. మీడియా కూడా కరపత్రాలుగా విడిపోయి.. ఏ నాయకులకు అనుకూలమైన మీడియా.. వారి కథనాలను మాత్రమే అందిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు నిజాలు తెలిసేదెలా?
అందుకే నాయకుల మాటలను నమ్మాలంటేనే ప్రజలకు చిరాకు పుడుతోంది. ఆధారాలు చూపిస్తే తప్ప ఎలాంటి ఆరోపణలనైనా నమ్మకూడదని అనుకుంటున్నారు. సాధారణంగా నాయకులు.. మా వద్ద చేసే ప్రతి ఆరోపణకు ఆధారాలన్నీ ఉన్నాయి.. వీటిని సరైన సమయంలో బయటపెడతాం అని పడికట్టు మాటలు చెబెతుంటారు. ఆరోపణలు చేసేవారు.. ఆధారాలు చూపడానికి వెరవడం ఎందుకు? అదంతా, ఆరోపణలు చేసిన తర్వాత.. సదరు నాయకులతో బేరసారాలు సాగించడానికేనా.. అని కూడా ప్రజలకు అనుమానం కలుగుతుండేది.
వర్తమానంలోకి వస్తే…
గీతం విద్యాసంస్థలకు జరిగిన భూ కేటాయింపు వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతోంది. బాలకృష్ణ వియ్యంకుడికి.. 493 ఎకరాలు ఎకరం లక్షవంతున అమ్మినట్లుగా.. బొత్స ఆరోపించారు. అదంతా బొత్స మంత్రిగా ఉండగానే, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిందని.. బాలయ్య అల్లుడు శ్రీభరత్ చెప్పుకొచ్చారు. దానికి బొత్స మళ్లీ కౌంటర్ ఇస్తూ.. 2015లో ఇచ్చిన జీవోను, అదే భూములను తిరిగి సీఆర్డీయే పరిధిలోకి తెస్తూ ఇచ్చిన జీవోలను కూడా కాపీలు చూపించారు జీవో నెంబర్లు కూడా చెప్పారు. 2012లో ఇచ్చినట్లుగా చెబుతున్న భరత్… అదే నిజమైతే ఆ జీవో చూపించాలని సవాలు విసిరారు కూడా. మీడియా వాళ్లు చెప్పిందల్లా రాసుకుపోకూడదని, కాగితాలు చూపించాల్సిందిగా అడగాలని విన్నవించారు.
ఇప్పుడు ఈ రచ్చలోకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. బొత్స మంత్రిగా ఉండగానే.. భూముల కేటాయింపు ఎంఓయూ అయిందని మళ్లీ అదే పాట అందుకున్నారు. ఓకే.. కావొచ్చు.. కానీ ఆ ఎంఓయూ కాపీ చూపించండి సార్లూ.. అని అడగాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. చూపించాల్సిన బాధ్యత నేతలపై ఉంది. కాఫీలు తాగించి, ఎవడిమీదో బురచల్లేద్దాం అని నేతలు తెగిస్తూ ఉంటే.. కాఫీలు తాగేసి.. చెప్పింది రాసుకుని వచ్చేద్దాం అన్నంత నిర్లిప్తంగా మీడియా ఉండకూడదు. సమాజానికి చేటు జరుగుతుంది.