ఎన్ఆర్‌సీ బిల్ : మోడీ జవాబు చెప్పగలరా?

ఎన్ఆర్‌సీ బిల్ ను కేంద్రమంత్రివర్గం మళ్లీ ఆమోదించేసింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఇది సభ ముందుకు వచ్చేస్తుంది. రాజ్యసభలో కూడా బిల్లు నెగ్గగల బలం తమకు సమకూరినదని మోడీ సర్కారు భావిస్తున్న తరుణంలో… గతంలో…

ఎన్ఆర్‌సీ బిల్ ను కేంద్రమంత్రివర్గం మళ్లీ ఆమోదించేసింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఇది సభ ముందుకు వచ్చేస్తుంది. రాజ్యసభలో కూడా బిల్లు నెగ్గగల బలం తమకు సమకూరినదని మోడీ సర్కారు భావిస్తున్న తరుణంలో… గతంలో వీగిపోయిన బిల్లు మళ్లీ ఇప్పుడు సభ ముందుకు వస్తోంది. ఇప్పటికే అసోంలో ఎన్ఆర్‌సీ బిల్ ను అమలు చేశారు. అక్కడ రాజుకున్న అగ్గి ఇంకా చల్లారలేదు. అన్ని రాష్ట్రాల్లో అమలు చేసి తీరుతాం అని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. దాని మీద ఇంకా రాద్ధాంతాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈలోగా బిల్లు పార్లమెంటు ముందుకు కూడా వచ్చేస్తోంది.

ఈ బిల్లు లక్ష్యం.. పొరుగున ఉన్న దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం ఇవ్వడం! అయితే ఇలాంటి అవకాశం కొన్ని ముస్లిం దేశాలనుంచి వచ్చిన, కొన్ని మతాలకు చెందిన వారికి మాత్రము పరిమితం చేశారు. ఎన్ఆర్‌సీ బిల్ లో పేర్కొంటున్న ప్రకారం… ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికే ఇది వర్తిస్తుంది. అలా వచ్చిన వారిలో కూడా… హిందు,సిక్కు, జైన్, బౌద్ధ, పార్శీ, క్రైస్తవులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. అంటే ప్రత్యేకించి ముస్లింలను మాత్రమే వేరుగా చూస్తున్నారు. ఈ మతాలకు చెందిన వారు, ఇప్పటిదాకా ఇండియాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా ఉంటే గనుక.. వారికి పౌరసత్వం ఇవ్వడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది.

ఈ ఎన్ఆర్‌సీ బిల్ మీద విపక్షాలు చాలా ధర్మసమ్మతమైన సందేహాలు లేవదీస్తున్నాయి. ముస్లిం మతస్తులను మాత్రం ఈ బిల్లులో చేర్చకపోవడం మీద పలు అభ్యంతరాలు ఉన్నాయి. ప్రత్యేకించి భారత్-పాక్ విడిపోయినప్పుడు.. పాకిస్తాన్ లోని లక్షలాది మంది హిందువులు సిక్కులు అక్కడినుంచి వలస వచ్చినట్లుగానే.. ముస్లింలు కూడా అనేకమంది వచ్చేశారు. అది ముస్లిందేశంగా ఏర్పడినంత మాత్రాన ప్రతి ముస్లిం అక్కడే ఉండాలనుకుంటాడని అనుకోవడం భ్రమ. భారత్ ప్రాంతంలోని వ్యక్తులు, ఊర్లతో బాంధవ్యం ఎక్కువగా ఉన్నవారంతా.. ఇక్కడికి వచ్చి ఉంటారు. ముస్లింలలో అలా వచ్చిన వారుంటే గనుక.. ఈ బిల్లు వారిని తిరిగి వెళ్లగొట్టడానికి ఉపకరిస్తుంది.

అలాగే శ్రీలంక నుంచి కూడా హిందూ, బౌద్ధ, క్రైస్తవ వర్గాలకు చెందిన అనేకులు ఇండియాకు వచ్చి ఉంటారు. కానీ… ఈ బిల్లులోని దేశాల జాబితాలో శ్రీలంక లేకపోవడం కూడా విమర్శలకు గురవుతోంది. మత ప్రాతిపదికన మనుషుల్ని వేరుచేసి చూస్తున్నట్లుగా ఈ బిల్లు స్వరూపం ఉంది. పార్లమెంటులో భాజపాకు ఉన్న బలాన్ని బట్టి.. బిల్లు నెగ్గవచ్చు.. ఓడవచ్చు కానీ.. ఈ బిల్లుపట్ల విపక్షాలు లేవనెత్తుతున్న సందేహాలు మాత్రం ధర్మసమ్మతమైనవి. వాటిని నివృత్తి చేయగల ధైర్యం మోడీ, అమిత్ షాలకు ఉన్నదా? లేదా ఎప్పటిలాగానే.. వారు మౌనం వీడకుండా.. తాము చేయదలచుకున్నది చేసుకుంటూ వెళ్లిపోతారా?