తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత కష్టంగా తయారైందో అందరికీ కనిపిస్తున్నదే. రాష్ట్రం ఏర్పాటు చేస్తే శాశ్వతంగా తాము అధికారంలో ఉండిపోవచ్చు అంతస్థాయిలో కలిగిన కాంగ్రెస్ పార్టీ.. వరుసగా రెండోసారి జరిగిన శాసనసభ ఎన్నికలలో కూడా పతనం అయిపోయింది. ఎంపీ ఎన్నికల్లోచావు తప్పి కన్ను లొట్టపోయినట్లు.. కాసిని సీట్లు వారికి దక్కాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రాభవం, నాయకులుగా తమ వైభవం.. అన్నీ మంట కలిసిపోయాయి కానీ.. అప్పట్లో చేసిన తప్పులు మాత్రం ఇప్పటికీ వెంటాడుతున్నాయి. బిడ్డ చచ్చినా పురిటివాసన మాత్రం పోలేదు అన్న సామెత చందంగా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉంది.
ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై తాజాగా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీచేసింది. గత ఐదేళ్లుగా వారి పార్టీ ప్రభుత్వంలో లేదు.. అవినీతికి దందాలకు పాల్పడే అవకాశం కూడా లేదు.. మరి, ఇంకా ఏం పోలీస్ కేసులు ఉంటాయా అని అనుకోవచ్చు. కానీ, తాము అధికారంలో లేకపోయినా ఎన్నికలు వస్తూనే ఉంటాయి గనుక.. ఎన్నికలకు ముడిపెట్టి అనేక అనేక హామీలు నాయకులు ఇస్తూ ఉంటారు గనుక చిక్కులు తప్పవు. అలాంటిది ఇప్పుడు రేణుకా చౌదరికి వచ్చిపడింది.
ఇది 2014 నాటి ఎన్నికలకు సంబంధించిన కేసు. ఆ ఎన్నికల సమయానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఢంకా బజాయించి గెలుస్తుందని ప్రచారం ముమ్మరంగా ఉంది. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రాన్ని నెరవేర్చిన తమ పార్టీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ విజయం సాధిస్తుందని వారు ఆశల పల్లకీలో ఊరేగుతూ ఉన్నారు. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద పట్టు కలిగి ఉన్న సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి, ఖమ్మం జిల్లాలో ఒక వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని సొమ్ము పుచ్చుకున్నారు అనేది ఫిర్యాదు. ఈ మేరకు ఆ వ్యక్తి భార్య కళావతి కోర్టును ఆశ్రయించారు.
విచారణలో భాగంగా కోర్టు పలుమార్లు రేణుకాచౌదరి నోటీసులు జారీచేసింది. వాటిని తిరస్కరించడంతో పాటు రేణుకాచౌదరి వాయిదాలకు హాజరుకాకుండా ఉండిపోయారు. దాంతో ఆగ్రహించిన ధర్మాసనం రేణుకాచౌదరి పేరిట నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. అధికారం లేదు, పదవులు లేవు అయినా రేణుకా చౌదరిని కేసులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. సామెత చెప్పినట్టు బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదంటే ఇదే!