నన్ను చూసి భయపడే నిర్మాణాలకు ఊపు

అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే మొదలైన, సగంలో ఉన్న అనేక నిర్మాణాలను కొనసాగించడానికి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు జరుగుతున్న పనులతో సహా.. నిర్మాణాలు అన్నింటినీ కొనసాగిస్తారు.…

అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే మొదలైన, సగంలో ఉన్న అనేక నిర్మాణాలను కొనసాగించడానికి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు జరుగుతున్న పనులతో సహా.. నిర్మాణాలు అన్నింటినీ కొనసాగిస్తారు. ఇంకా మొదలు కాని.. కోర్ కేపిటల్ కీలకభవనాల విషయంలోనే పునరాలోచన ఉంటుంది.. ఇదీ ప్రభుత్వపు తాజా పోకడ.

అయితే జగన్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి… ఆయనను ఆడిపోసుకోవడానికి, ప్రజల ఎదుట విలన్‌గా చిత్రీకరించడానికి అమరావతి రాజధాని అనేది.. విపక్షాలకు ఒక అస్త్రంలాగా ఉపయోగపడుతూ వచ్చింది. రాజధానిని జగన్ వచ్చాక భ్రష్టు పట్టించేశారని తెలుగుదేశం ఎంత యాగీ చేసిందో లెక్కలేదు. ఆ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల వద్దకు మీడియాను కూడా తీసుకువెళ్లి.. వీటన్నింటినీ అర్థంతరంగా వదిలేశారంటూ గోల చేశారు.

దానికి తోడు ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు తగ్గిన సమయంలో.. రాజధాని భవనాల నిర్మాణ పనుల నిలిపివేతను కూడా దానికిక ముడిపెట్టారు. కొన్ని వేల మంది కార్మికులు రాజధాని ప్రాంతంలో ప్రతిరోజూ పనిచేస్తున్నారని.. వారి జీవితాలు అగమ్యగోచరంగా మారిపోయాయని.. మొసలి కన్నీళ్లు కార్చారు. వారందరి నోర్లకు తాళాలు వేసేలా.. ఇప్పుడు జగన్.. నిర్మాణాలను కొనసాగించే నిర్ణయం తీసుకున్నారు. అయితే వీటిలో అనవసరపు ఖర్చు ఎక్కడెక్కడ ఉన్నదో దానిని మదింపు వేయించి.. కోత పెట్టడానికి కూడా కసరత్తుకు శ్రీకారం చుట్టారు.

 ఈ నిర్ణయాన్ని కూడా విపక్షాలు తమ మైలేజీకోసం కక్కుర్తిగా వాడుకునే అవకాశం కనిపిస్తోంది. మేం చేసిన ఆందోళనలకు జగన్ జడుసుకుని.. ఈ నిర్ణయం తీసుకున్నాడు.. అని వాళ్లు క్లెయిం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. నిజానికి జగన్ ఏ మంచి నిర్ణయం తీసుకున్నా.. దాన్ని తమ పోరాటం వల్లనే తీసుకున్నట్లుగా రంగుపులిమే అలవాటు ఇప్పటికే విపక్షాల్లో ఉంది. నదుల్లో ఉధృతి తగ్గి ఇసుక తవ్వకాలు పెరిగాక, ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తే.. నా విశాఖ లాంగ్ మార్చ్ వల్లనే జగన్ అలా చేశాడని పవన్, నా 12 గంటల దీక్ష వల్లనే జరిగిందని చంద్రబాబు టముకు వేసుకున్నారు. అలాంటి వారు.. ఈ నిర్మాణాల విషయంలో ప్రోసీడ్ కావడాన్ని కూడా తమ సొంతడబ్బాకు వాడుకునే ప్రమాదం ఉంది.