వైఎస్ జగన్మోహనరెడ్డికి తెలివితేగలు సుతరామూ లేనట్లుగా ఉంది. కనీసం ఇలాంటి విషయాల్లోనైనా మాజీ ముఖ్యమత్రి చంద్రబాబునాయుడు కున్న నలభయ్యేళ్ల అనుభవం నుంచి ఆయన పాఠాలు నేర్చుకుంటే బాగుంటుందేమో! ఏ విషయంలో ఎవరి సలహాలు తీసుకోవాలి… ఏ స్థానంలో ఎవరిని పెట్టాలి… ఎవరికి పెద్దపీట వేయాలి..? అనే విషయాలను చంద్రబాబు ను అడిగి తెలుసుకుంటే బహుశా.. జగన్ మరింగ క్రేజీగా పనిచేయడం వీలవుతుందేమో. కానీ.. జగన్ తనకు అవగాహన లేకుండా.. క్రేజ్ పెరిగే అవకాశం కోల్పోతూ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు.
జగన్మోహన రెడ్డి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను కొనసాగించదలచుకున్నారు. కాకపోతే.. రాజధాని నిర్మాణాల ముసుగులో.. దోపిడీని మాయామహేంద్రజాలాలను ఆయన ఇష్టపడడం లేదు. నిర్మాణాల పరిమాణం, ఖర్చు తగ్గించాలంటూ అధికార్లకు సూచనలు చేశారు. ఆర్భాటాలకు వెళ్లకుండా.. నిర్మాణాలు తక్కువ ఖర్చులో జరిగేలా చూడాలని మార్గదర్శనం చేశారు. అయితే పనుల సైజు, అంచనా వ్యయం లను తగ్గించేందుకు ఐఐటీ నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా జగన్ సూచించారు. ఇక్కడే వస్తోంది చిక్కు.
ఐఐటీ నిపుణుల సలహాలు తీసుకుని ఖర్చు తగ్గిస్తే ప్రజల్లో క్రేజ్ ఎలా వస్తుంది? అసాధ్యం కదా…? ఈ విషయాన్ని గుర్తించగల తెలివి జగన్కు లేకుండా పోయింది. అదే చంద్రబాబును అడిగి ఉంటే ఖర్చు తగ్గించడం ఎలా.. అని సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ ఇంజినీర్లందరినీ పిలిచి.. వారికి కొన్ని వందల కోట్లు ఫీజులు ఇచ్చి ఎలా ఖర్చు తగ్గించాలో.. కంప్యూటర్ డిజైన్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లతో సహా రెండేళ్లలోగా నివేదికలు తెప్పించి ఉండేవాడు. దాంతో మరో ఏడాది పాటూ హడావిడి చేసి ఉండొచ్చు. కానీ.. జగన్ పిచ్చోడిలాగా.. నిధులు రిలీజ్ చేస్తాం.. ఐఐటీ వారితో ఖర్చు తగ్గించే ఆలోచనలు చేసి.. పనులు కొనసాగించండి అంటున్నారు.
అయినా.. నిర్మాణాలకు డిజైన్లు చేయించాలంటే.. బాహుబలి లాంటి సినిమా తీసిన రాజమౌళిని కన్సల్టెంటుగా పెట్టుకోవాలి. అప్పుడు మాహిష్మతి లాంటి డిజైన్లు వస్తాయి. ఖర్చు తగ్గించాలంటే.. సాహో లాంటి సినిమాకు పొడక్షన్ మేనేజర్ గా పనిచేసిందెవరో తెలుసుకుని.. వాళ్లను కన్సల్టెంటుగా పెట్టుకోవాలి. అప్పుడు ఖర్చు తగ్గుతుంది. ఈ మాత్రం కిటుకు జగన్ కు తెలియలేదు పాపం..!!