Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ అడుగుజాడల్లో ఇతర రాష్ట్రాలు!

జగన్ అడుగుజాడల్లో ఇతర రాష్ట్రాలు!

విపక్షాలు ఎన్ని రకాలుగా మాటలు అంటున్నప్పటికీ.. ఒక ముఖ్యమంత్రి ప్రజారంజకమైన మంచి పాలన అందిస్తున్నాడా? లేదా? తెలియడానికి.. ప్రబల నిదర్శనాలు కొన్ని ఉంటాయి. మరో రాష్ట్రం ఎవరైనా ఆ నిర్ణయాలను అనుసరించడానికి ప్రయత్నిస్తే గనుక.. ఖచ్చితంగా ఆ పాలన వందకు వంద మార్కులు కొట్టేసినట్టే.

ఆ రకంగా ఇప్పుడు జగన్మోహన రెడ్డి కి వందమార్కులు లభిస్తున్నాయి. ముఖ్యమంత్రి అయిన తొలిసారే, తొలి ఏడాదిలోనే.. శెభాష్ అనిపించుకునే  ఇలాంటి నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారు. తాజాగా ఏపీ కొత్తగా ప్రవేశ పెట్టిన దిశ చట్టాన్ని , మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించబోతోంది.

దిశ చట్టం, అమ్మాయిల పట్ల జరిగే అత్యాచారాలకు అడ్డుకట్ట వేయడంలో ఎంతటి కృతనిశ్చయం ఉన్న చట్టమో మనందరికీ తెలుసు. దిశ ఘటన బయటపడగానే.. ముఖ్యమంత్రి ఆ వెనుక జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే దిశ చట్టాన్ని ప్రతిపాదించారు. 21రోజుల్లోగా విచారణ ముగిసి, శిక్షలు పడేలా చేసే చట్టం ఇది.  

అత్యాచారాలకు పాల్పడాలనుకునే వారి వెన్నులో వణుకు పుట్టేలా నిబంధనలు రూపొందించారు. ఈ విషయంలో విపక్ష తెలుగుదేశాన్ని కూడా అభినందించాలి. ఈ చట్టాన్ని వారు కూడా పూర్తిగా సమర్థించారు. అంతటి భేషైన పథకం కావడంతో.. ఆ చట్టం మీద పొరుగు రాష్ట్రాలు కూడా దృష్టి సారించాయి.

 మహారాష్ట్రంలో కూడా దిశచట్టాన్ని పెట్టడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీలో చట్టం విధివిధానాలు అమలు తీరును అధ్యయనం చేయడానికి ఒక బృందం అధికారులు మహారాష్ట్రనుంచి వచ్చారు. ఈ చట్టం తెచ్చిన జగన్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ.. తమ రాష్ట్రంలో కూడా దీన్ని ప్రవేశపెట్టనున్నాం అని చెప్పారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో హోం మంత్రిని కలిసినప్పుడు జగన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఈ చట్టం గురించి కూడా ప్రస్తావించారు.

నిజానికి దిశ విషయంలో జగన్ నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరించే పోకడ ఇప్పుడు కనిపిస్తున్నది గానీ.. ముందుముందు మరిన్ని పథకాలను ఇతరులు అనుసరించక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రత్యేకించి. ‘అమ్మఒడి’ లాంటి పథకాలు.. విద్యావ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు, ఓటు బ్యాంకు పరంగా కూడా గట్టి పథకాలు కావడంతో.. ఇతర రాష్ట్రాల వారు ఇంకాస్త ఎన్నికల సీజన్ దగ్గరకొచ్చిన తర్వాత.. వాటిని కూడా ఖచ్చితంగా అనుసరిస్తారనేది వారి విశ్లేషణగా ఉంది. చూద్దాం ఇతర రాష్ట్రాలనుంచి జగన్ ను మంచి ముఖ్యమంత్రిగా ఇంకా ఎందరు అభినందిస్తూ వస్తారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?