చెరువు మీద అలిగినట్లుగా చేస్తున్న పాక్!

చెరువు మీద అలిగిన ఒక ప్రబుద్ధుడు ముడ్డి కడుక్కోవడం మానేశాడని వెనకటికి పల్లెపట్టుల్లో ఒక మొరటు సామెత చెలామణీలో ఉండేది. ఇప్పుడు పాకిస్తాన్ వ్యవహారం కూడా అలాగే తయారవుతున్నట్లుంది. భారత్ తో సున్నం పెట్టుకుని..…

చెరువు మీద అలిగిన ఒక ప్రబుద్ధుడు ముడ్డి కడుక్కోవడం మానేశాడని వెనకటికి పల్లెపట్టుల్లో ఒక మొరటు సామెత చెలామణీలో ఉండేది. ఇప్పుడు పాకిస్తాన్ వ్యవహారం కూడా అలాగే తయారవుతున్నట్లుంది. భారత్ తో సున్నం పెట్టుకుని.. వాణిజ్యాన్ని కట్ చేసుకుని, ఇరుదేశాల మధ్య పౌరరవాణాకు ఉద్దేశించిన రైళ్లను రద్దు చేసేసి… నానా రకాలుగా తమ చేతులను తామే నరుక్కుంటున్న పాకిస్తాన్ ఇప్పడు అంతర్జాతీయంగా కూడా అదే పనిచేస్తోంది.

ఆర్టికల్ 370ని రద్దుచేసిన నాటినుంచి పాక్ తమ భారత్ మీద విషం కక్కుతూనే ఉంది. ఐరాస వద్దగానీ, అంతర్జాతీయ వేదికపై ఇతర దేశాల ముందుగానీ.. భారత్ ను నిందితుడిగా చాటడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి పాక్ కు తల బొప్పికట్టింది. ఒకటిరెండు దేశాలు తప్ప.. ఈ విషయంలో ఎవ్వరూ వారికి మద్దతివ్వలేదు. భారత్ చేసింది తప్పుఅనీ అనలేదు. కాశ్మీర్ వ్యవహారం భారత్ అంతర్గత సమస్య అని.. ఏదైనా ఉంటే ద్వైపాక్షికంగా మాత్రమే పరిష్కరించుకోవాలని అంతా చెబుతూ వచ్చారు. ఇవన్నీ పాక్ కు చేదు సంగతులు కాగా, తాజాగా యూఏఈ మీద విషం కక్కుతోంది.

యూఏఈతో భారత్‌కు తొలినుంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఇటీవలే భారత ప్రధాని నరేంద్రమోడీకి.. యూఏఈ సర్కారు తమ దేశపు అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయేద్ ను బహూకరించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూఏఈ రాజు మోడీని తన సోదరుడిగా అభివర్ణించారు. ఈ పోకడలను పాకిస్తాన్ జీర్ణం చేసుకోలేకపోయింది. ఉడికిపోయింది. వారి క్రోధానికి నిదర్శనంగా.. ఆదేశంలో జరగాల్సి ఉన్న అధికారిక పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. ఆకోపంతో… యూఏఈలో జరగాల్సి ఉన్న తన అధికారిక పర్యటనను పాకిస్తాన్ సెనేట్ ఛైర్మన్ సాదిక్ సంజ్రానీ రద్దు చేసుకున్నారు.

భారత్ తో స్నేహంగా ఉన్నందుకు ఆ దేశాలతో సంబంధాలను తెంచుకోవడమే గనుక పాక్ మార్గం అయితే.. ముందు ముందు.. అన్ని ప్రపంచదేశాలతోనూ వారి సంబంధాలు తెగిపోతాయేమో. ఏదో ఒకనాటికి.. ఒకటిరెండు దేశాలతో మాత్రం సంబంధాలు నెరపుతూ పాకిస్తాన్ ఒంటరి అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!