‘అమరావతి’ కథ ముగిసిందా..?

ఏటివొడ్డున ఇసుకతో హర్మ్యం నిర్మిస్తే అది కుప్పకూలిపోవడానికి కొంత సమయం పడుతుంది. కూల్చడానికి కొంత ప్రయత్నం అవసరమౌతుంది! అదే, బూడిదతో హర్మ్యం నిర్మిస్తే… ఏమౌతుంది. రివ్వున గాలి వీచినా చాలు, ఉఫ్ మని ఊదినా…

ఏటివొడ్డున ఇసుకతో హర్మ్యం నిర్మిస్తే అది కుప్పకూలిపోవడానికి కొంత సమయం పడుతుంది. కూల్చడానికి కొంత ప్రయత్నం అవసరమౌతుంది! అదే, బూడిదతో హర్మ్యం నిర్మిస్తే… ఏమౌతుంది. రివ్వున గాలి వీచినా చాలు, ఉఫ్ మని ఊదినా చాలు… అసలు ఆనవాళ్లే తెలియకుండా మాయమైపోతుంది. ఇప్పుడు అమరావతి పరిస్థితి అదే. ‘అమరావతి భస్మనగరం’ ముంపు భయాల పెనుగాలుల్లో.. ప్రజల్లో రేకెత్తుతున్న భయాందోళనల్లో ఉఫ్ మని ఊదినట్లుగా అంతర్ధానమైపోతున్నది.

‘విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనే రాజధాని నగరాన్ని నిర్మించడానికి తొలుత ఒక విఫలప్రయత్నం జరిగింది’ అని బహుశా చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి రావొచ్చు. చంద్రబాబు ప్రతిపాదించిన అమరావతి అనేది సుదృఢమైన, సురక్షితమైన రాజధాని అనే నమ్మకం ప్రజల్లో సడలిపోయింది. నగర డిజైన్లు, భవంతులు, చంద్రబాబు కంప్యూటరు తెరమీద చూపించిన వైభోగం అంతా ఇక కాలగర్భంలో కలసిపోవడానికి ఎంతో దూరం లేకపోవచ్చు. రాష్ట్రం ఇరుచివర్ల ప్రజలకూ అందుబాటులో ఉండేలా, నిర్మాణం వలన సామాన్యులకు వీసమెత్తు ఇబ్బంది కలుగకుండా ఉండేలా.. దొనకొండనే రాజధాని చేసే దిశగా అడుగులు పడుతున్నాయని పుకార్లున్నాయి.

చంద్రబాబును నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే… ఆయన ప్రదర్శించిన మాయాజాల, మహేంద్ర జాల విద్యల దుష్ఫలితం ఈ పరిణామం. అయిదేళ్లపాటూ చిన్న అడుగు వేయకుండా.. ఇదే రాజధాని నగరం అంటూ అద్భుత డిజైన్లను ప్రజలకు మార్చి మార్చి చూపిస్తూ మభ్య పెట్టినందుకు ఇలాంటి పరిణామం వచ్చి పడింది. ఆయన అభూత కల్పనలు, కల్పించిన అపోహలు అన్నీ పొరలు వీడినట్లుగా క్రమంగా తొలగిపోతున్నాయి. అమరావతి నగరం ముసుగులో ఉన్న డొల్లతనం బయటపడుతోంది. ప్రజల దృక్పథం కూడా మారుతోంది.

ఏ ఆధరవూ లేకుండా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని అంటూ ఒకటి నిర్మించడానికి ప్రభుత్వం పూనుకుంటే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. మరీ సంకుచితంగా మా ఊర్లోనే రాజధాని కట్టాలని ఆశించేంత మూర్ఖంగా ఉండరు. ప్రభుత్వం తగిన సంభావ్యతలను ఎంచుకుంటుందని ప్రజలు సహజంగా నమ్ముతారు. 2014లో అదే జరిగింది. అలాంటి ప్రజల నమ్మకం వలనే అమరావతి రాజధాని ప్రాంతంగా గుర్తింపు పొందింది. కొందరు రైతులు ఆశగానే తమ పొలాలు ఇచ్చారు. కొందరిని బెదిరించి, ప్రలోభ పెట్టి తీసుకున్నారు.

ఇవాళ రాజధాని అక్కడ ఉండదనే ప్రచారం ముమ్మరంగా ఉంది. చాలా మందికి ఆందోళన కలిగిస్తోంది. దొనకొండకు తరలిపోతుందనే ప్రచారంతో కొందరు కృత్రిమ రియల్ బూమ్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో గుంటూరు- కృష్ణా జిల్లాల నడుమ అదే ప్రాంతంలో ఉంటుంది గానీ.. ప్రస్తుతం కోర్ కేపిటల్ గా ప్రభుత్వం అనుకుంటున్న చోటు కాకుండా కాస్త పక్కకు జరగవచ్చుననే ప్రచారం కూడా ఉంది.

ఒక్కసారి ప్రజల్లోకి అనుమానం, భయం నాటుకున్న తర్వాత.. దానినుంచి ఎవరికి వారు వ్యక్తిగతంగా లబ్ధిపొందడానికి అనేకానేక పుకార్లను జోడించి ప్రచారం చేస్తుంటారు. కాబట్టి.. ఇప్పుడు సాగుతున్న ప్రచారాలు అన్నింటినీ నమ్మకుండా ఉండడం మంచిది. అయితే చర్చనీయాంశం ఏంటంటే… ఇలాంటి భీతావహమైన పరిస్థితి ఎందుకు దాపురించింది? పచ్చదళాలు నిందిస్తున్నట్లుగా ఈ భయం ప్రజల్లో ఏర్పడడానికి జగన్మోహనరెడ్డి ప్రభుత్వమే కారణమా?… ఇవి లోతుగా తెలుసుకోవాల్సిన విషయాలు!

పాపం చంద్రబాబుదే!
ఏ మాట కామాటే చెప్పుకోవాలి. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు, దాన్ని సమర్థంగా నడిపించడానికి అనాథ రాష్ట్రానికి కాస్త దశదిశ నిర్దేశించడానికి సమర్థుడైన నాయకుడు ఎవరు అనే మీమాంస వచ్చింది. ప్రజలంతా మూకుమ్మడిగా.. అంతటి సమర్థుడు చంద్రబాబునాయుడే అని నమ్మి సీఎం చేశారని వ్యాఖ్యానిస్తే అందులో అపరిపక్వత కనిపిస్తుంది. ఆయనను తొలుత నమ్మినది మోడీ, పవన్ కల్యాణ్. అప్పటికి మోడీ హవా దేశమంతా ఉంది. కాబోయే ప్రధాని అనే ప్రచారం ఉంది. పవన్‌కు కూడా క్లీన్ ఇమేజి ఉంది. (2019 ఎన్నికల సమయానికి ఆయన మాటల్లోనే తప్ప చేతల్లో వీరుడు కాదని ప్రజలు అర్థం చేసుకున్నారు.) వాళ్లిద్దరూ నమ్మేసరికి తటస్థ ప్రజలు కూడా చంద్రబాబును నమ్మారు.

నిజమే కాబోలు- చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని ఆదుకుంటాడని అనుకున్నారు. అది ఆయనకు కలిసి వచ్చింది. ఎప్పటికైనా తన స్వశక్తితోనే అధికారంలోకి రాదలచుకున్న జగన్ అతి స్వల్ప తేడాతో అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఏదో ఒకతీరుగా దక్కిన అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ప్రజలు మళ్లీ ఎప్పటికీ నమ్మలేని విధంగా తన అసమర్థత నిరూపించుకున్నారు. బలవంతంగా రైతులనుంచి పొలాలను లాక్కుని.. అంతా బీళ్లుగా ఉంచేసి.. నగర నిర్మాణాన్ని గాలికొదిలేసి, ప్రజల ముందు త్రీడీ డిజైన్లు చూపించి.. ఆయన చేసిన మాయ జగద్విఖ్యాత మెజీషియన్ లకు కూడా చేతకానిది.

ఇటీవల చంద్రబాబు చెప్పిన మాటలు గమనించిన ప్రజలకు కడుపు మండుతోంది. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో అసలు రాజధానికి అవసరమైనవి పోగా, మిగిలే ఎనిమిది వేల ఎకరాలను అమ్ముకుంటే.. ఎంచక్కా రాజధాని కట్టుకోవచ్చునని ఆయన జగన్ ప్రభుత్వానికి హితవు చెబుతున్నారు. నలభయ్యేళ్లు ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తినుంచి ఇంత దారుణమైన వంచన, మోసాన్ని  ఆశించలేం. మరి రాజధాని నిర్మాణానికి నిధుల కొరత పూడ్చుకోవడం, అమ్మకం ద్వారా అంత సులువు అయినప్పుడు… ఆయన ఇన్నాళ్లూ ఎందుకంత కాలయాపన చేశారు. ఎవరిని మోసం చేయడానికి?

ఆరోపించడానికి కూడా అసహ్యంగా ఉన్నా చంద్రబాబు ఒక కులానికి మేలు చేయడానికి మాత్రమే ఇప్పుడున్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశాడనేది సత్యం. అది కుట్రగనుకనే ఇవాళ తేలిపోయింది. ‘నేను మళ్లీ గెలిస్తే తప్ప… రాజధాని అనేది ఈ రాష్ట్రానికి ఉండదు’ అని ఆయన ప్రజలను భయపెట్టదలచుకున్నారు. అందుకే… పదేపదే డిజైన్లు చూపిస్తూ ఆర్భాటం చేసి.. చివరిదాకా సాగదీశారు. ఫలితం అందరికీ తెలిసిందే.

బాబు అచేతనత్వం, రాష్ట్రానికి వరం..
దానిని అసమర్థత అనండి, కుట్ర అనండి.. రాజధాని విషయంలో అయిదేళ్లపాటూ చంద్రబాబునాయుడు అచేతనత్వం అనేది ఇవాళ రాష్ట్రానికి వరంగా మారింది. ఆయన ఏమీ చేయకపోవడం వల్ల.. ఇవాళ ఆయన ఎంపికచేసిన ప్రాంతం ‘ప్రకృతివిరుద్ధం’ అనే స్పృహ ప్రజలకు కలిగింది. మనరాష్ట్రంలో భారీ వర్షాలు కురవనేలేదు. ఎక్కడో పొరుగురాష్ట్రాల్లో వానలు కురిసి, నదులకు వెల్లువ వస్తే.. రాజధాని ప్రాంతం మునిగిపోయేంత పరిస్థితి వచ్చిందంటే.. వెన్ను జలదరిస్తుంది. ఈ విషయంలో కొత్త ప్రభుత్వానికి అనుభవం లేదని, పదిరోజుల ముందునుంచే కొద్దికొద్దిగా నీరు వదిలేసి ఉండవచ్చునని.. ఎలాంటి కాకమ్మకబుర్లతోనైనా చంద్రదళం బుకాయించవచ్చు గాక! కానీ.. ప్రకృతిని విచ్ఛిన్నం చేసే ‘జోన్’లోనే రాజధానిని నిర్మించదలచుకున్నారని ఇవాళ ప్రజలకు తేటతెల్లమైంది.

అమరావతి ప్రాంతాన్ని ఎంపికచేసిన తొలి నాటినుంచి.. కొండవీడు వాగు పొంగితే ముంపు ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ‘అదెప్పుడు పొంగాలి…’ అంటూ పచ్చదళాలు అప్పుడు ఎద్దేవా చేశాయి. తీరా దాని ప్రస్తావన లేకుండానే ముంపు ప్రమాదం వచ్చింది. ఇక రాష్ట్రంలో వర్షాలు కూడా కురిసి, కొండవీడు వాగు కూడా వచ్చి ఉంటే ఏమైఉండాలి. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండానే.. ప్రకృతి ఆ స్థలం ఎంపికలో మనకు స్పష్టమైన హెచ్చరికను తెలియజేసింది. పక్కకు తప్పుకోమన్నది. నిజానికి, భూకంపాలను అంచనావేసే శాస్త్రవేత్తలు కూడా అమరావతి ప్రాంతాన్ని రాజధానికి అత్యంత అననుకూలమైన ప్రదేశంగా నిర్ధారించారు. అప్పట్లో అలాంటి అధ్యయనాలు జరిగాయి. నివేదికలను సమర్పించడం కూడా జరిగింది.

కానీ.. ఒక దార్శనికుడైన నాయకుడిగా.. నిపుణులు అధ్యయనాల్తో తేల్చిచెప్పే సంగతులను అవగాహన చేసుకోవాల్సిన చంద్రబాబు భిన్నంగా ప్రవర్తించారు. అక్కడే ఎంపికచేశారు గానీ.. నిర్మణాలు చేపట్టకుండా ఉండడం వలన ఇవాళ ఆ ప్రాంతాన్ని వదిలించుకోవడానికి అనుకూల వాతావరణం కల్పించారు. ఇవాళ ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక నష్టం లేకుండా ఆ ప్రాంతంనుంచి రాజధానిని పక్కకు మరలిస్తే.. అందుకు చంద్రబాబుకే థాంక్స్ చెప్పుకోవాలి.

నివేదికలు తుంగలో తొక్కడం మహాపాపం!
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటుచేసింది. వారు రాష్ట్రంలోని మొత్తం 11 జిల్లాల్లో పర్యటించి… దాదాపు అయిదువేల మందితో మాట్లాడి, 187 పేజీల నివేదిక రూపొందించారు. ఇప్పుడున్న అమరావతి ప్రాంతాన్ని వారు అత్యంత అననుకూల ప్రదేశంగా తేల్చారు. చంద్రబాబు సర్కారు ఆ నివేదికను చెత్తబుట్ట దాఖలు చేసింది. తమ తమ స్వార్థ చింతనలతో ఆ ప్రదేశాన్ని ఎంపిక చేసింది. నది ఒడ్డునే నాగరికతలు విలసిల్లాయి అనే క్షుద్ర వాదనలను తెరమీదికి తెచ్చింది.

అన్నిటినీ మించి.. శివరామకృష్ణన్ కమిటీ అధికార వికేంద్రీకరణను ప్రతిపాదించింది. అసెంబ్లీ, సెక్రటేరియేట్ ఒకచోట, హైకోర్టు మరోచోట, కీలక కార్యాలయాలు, విద్యాసంస్థలు మరోచోట.. ఇలా కేటాయించాలని.. అప్పుడు రాష్ట్రమంతా సమతుల్య అభివృద్ధి జరుగుతుందని హితవు చెప్పింది. ఆ మాటలేవీ చంద్రబాబు చెవికెక్కలేదు. ఆయన తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి.. అభివృద్ధి అనే ప్రతిదానినీ హైదరాబాదులోనే కుమ్మరించి, విభజన సమయంలో రెండు ప్రాంతాల ప్రజలు కత్తులు దూసుకునేలా వైమనస్యం రేగడానికి ఆయన ఎలా కారకులయ్యారో.. ఇక్కడ కూడా అదే తప్పు చేశారు. సమస్తం ఈ అమరావతిలో కేంద్రీకృతం చేసే ఆలోచన చేశాడు. కానీ.. దాన్ని అమల్లో పెట్టకుండా ఊరుకున్నాడు.

ఆయారంగాల్లో మేధావులు, నిపుణులు అయిన వ్యక్తులను శివరామకృష్ణన్ కమిటీగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తే.. సాధికారత, శాస్త్రీయతతో కూడిన నివేదిక ఇస్తే అది చంద్రబాబుకు కంటగింపు అయింది. రాజధాని నగరానికి డిజైన్లు రూపొందించే పేరుతో సినీ దర్శకుడు రాజమౌళిని ప్రత్యేకబృందంతో విదేశాలకు సలహాల కోసం పంపాడు. ఆయన తలపెట్టిన రాజధానికి సుస్థిరత, సుదృఢతను దృష్టిలో ఉంచుకునే శాస్త్రీయమైన నిపుణులు అక్కర్లేదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కోటలు, కంప్యూటర్లతో తయారుచేసే బొమ్మలతో ప్రజలను భ్రమింపజేసి.. వారు భ్రమానందాన్ని లాభాలుగా మార్చుకునే ఎంటర్‌టైనర్‌లు కావాలనుకున్నారు. ఆ ప్రయత్నం సాంతం సర్వభ్రష్టత్వం చెందింది.

ప్రాంత సమన్యాయానికి దిక్కులేదా?
అందరూ  అన్నీ మాట్లాడుతున్నారు. ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాల మధ్య సమన్యాయం కోసం 1937లోనే పెద్దలంతా కలిసి తీర్మానించిన శ్రీబాగ్ ఒడంబడికను ఎప్పుడో మంటగలిపేశారు. రాయలసీమ- ఆంధ్ర ప్రాంతాల మధ్య ఒక ప్రాంతంలో రాజధాని ఏర్పాటయితే, మరో ప్రాంతంలో హైకోర్టు ఉండాలంటుంది అప్పటి ఒప్పందం. అవేవీ ఎవ్వరూ పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని చీల్చినప్పుడు.. ‘ఇలాంటివన్నీ వారి సొంత వ్యవహారాలు’ అంటూ కేంద్రం తప్పించుకుంది. తొలి సీఎం అయిన చంద్రబాబుకు ‘సమన్యాయం’ అనేదే గిట్టని పదం. రాజధాని, హైకోర్టు రెండూ ఒక్కచోటే కొలువుదీర్చే కుట్ర చేశారు.

ఇప్పుడు మనం రాజధానిగా భావిస్తున్న రాజధానిలో సచివాలయమూ, హైకోర్టూ రెండూ శాశ్వత భవనాలు కాదు. అందుకే జగన్ సర్కారు అయినా.. ప్రాంతాల మధ్య సమతూకం దృష్టిలో పెట్టుకుని.. వ్యవహరించాలి. అధికార వికేంద్రీకరణలో నిశిత, నిర్దుష్ట దృక్పథంతో వ్యవహరించాలి.

నెక్ట్స్ ఏంటి?
చంద్రబాబు కలగన్న అమరావతి రాజధానిగా పనికిరాదని తేలిపోయింది. నడమంత్రపు దళారులు ఇప్పుడు విశ్వరూపం దాలుస్తున్నారు. జగన్ ముందునుంచి అటువైపే.. రాజధాని దొనకొండకు వెళ్లిపోతోంది అని ప్రచారం స్టార్ట్ చేసి, లబ్ధి పొందాలని చూస్తున్నారు. జగన్ స్వయంగా ప్రకటన చేసేవరకూ ఏదీ నిజం కాదు. కానీ అధికారంలోని పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతున్న తీరు, వివరాలను బట్టి దొనకొండకు వెళ్లకపోవచ్చుననే అభిప్రాయాలు కొందరికి కలుగుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ‘నిజమైన రాజధాని’కి అవసరమైనని ప్రభుత్వ భూములు మంగళగిరి పరిధిలోనే ఉన్నాయని… రైతులనుంచి లాక్కున్న సస్యశ్యామల నల్లరేగడి భూములు అక్కర్లేదని అంటున్నారు.

మరికొన్ని సంకేతాలను బట్టి.. రాజధాని అక్కడినుంచి ఎక్కడికో వెళ్లిపోకపోవచ్చు గానీ.. నదీ పరివాహక ప్రాంతం కాకుండా, ముంపు ముప్పులేకుండా ఉండే సురక్షిత జోన్ కు మారుతుందని మాత్రం అనుకోవచ్చు. (ఈ వాక్యాలు.. రియల్ ఎస్టేట్‌ను  ప్రభావితం చేసేందుకు ఉద్దేశించినవి కాదు.) స్థలం ఏదైనా కావొచ్చు గాక… చాలా విషయంల్లో దృఢవైఖరితో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి.. రాజధాని ఎక్కడ అనేది ఒక నిర్ణయానికి రాగానే పనులను మాత్రం శరవేగంతో పరుగులెత్తించగలరనే ప్రజలు అనుకుంటున్నారు. ఆ ఒక్క కార్యశీలత చాలు… దుష్ప్రచారాలని, అపకీర్తి పాల్జేయాలనే పన్నాగాలను పటాపంచలు చేసేస్తుంది.

అప్రమత్తత అవసరం!
రాజధాని ప్రాంతం ఎంపికలు, నిర్మాణాల విషయంలో ముందడుగు వేయడంలో జగన్ చాలా అప్రమత్తంగా ఉండాలి. తన తండ్రి వైఎస్సార్ ఏ రకంగా అయితే జనం గుండెల్లో నిలిచిపోయారో.. తాను కూడా అదే తరహాగా జన హృదయాలను గెలుచుకోవాలనేది తన లక్ష్యం అని జగన్ అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటారు. రాష్ట్ర చరిత్రలో వ్యక్తులు అంతరించిపోయినా.. శాశ్వతంగా ఉండే రాజధాని విషయంలో ఆయన సంకుచితమైన అభిప్రాయాలకు రాకూడదు. ఒత్తిళ్లకు లొంగకూడదు. ఇలాంటిచోట్ల స్వజనాపేక్ష, ఆశ్రితపక్షపాతానికి పెద్దపీట వేస్తే చరిత్ర శూన్యులౌతారు చంద్రబాబు చేసిన తప్పు అదే. దానినుంచి ఆయన పాఠం నేర్చుకోవాలి.

అంతిమంగా ఓ సంగతి ప్రస్తావించాలి.
రామాయణంలో, రాజాజ్ఞ మేరకు బంగారులేడిగా వేషం దాల్చే ముందు జ్ఞాని అయిన మారీచుడు, రావణునికి హితవు చెబుతాడు.
సులభాః పురుషాః రాజన్ సతతం ప్రియవాదినః
అప్రియస్య చ పథస్య వక్తా శ్రోతా చ దుర్లభః
“ఓ రాజా! మనకి నచ్చేట్లు మాట్లాడేవాళ్లు అనేకులు మన చుట్టూ తిరుగుతుంటారు. నిజమైన మంచి చెప్పేవాడు దొరకడం కష్టం. ఎందుకంటే మంచి చేదుగా ఉంటుంది. నచ్చకపోయినా మంచి చేసేదానినే “పథ్యము” అంటారు. అలాంటి మంచిమాటలు చెప్పేవారు అరుదు! వినేవారు కూడా అరుదే!!” అని ఈ శ్లోకభావం. మారీచుడు మంచి చెప్పాడు. రావణుడు విన్లేదు. ఏం జరిగిందో మనకు తెలుసు.

శివరామకృష్ణన్ కమిటీ, ఇంకా అనేక మంది మంచి చెప్పారు.. చంద్రబాబు వినలేదు. ఏం జరుగుతోందో మనం చూస్తున్నాం. జగన్ అప్రమత్తత వహించాలి. తనకు రుచించడంతో నిమిత్తం లేకుండా.. ఇతరుల మాటల్లోంచి మంచి ఏదో, హితం ఏదో స్వీకరించాలి.
-కపిలముని
[email protected]