ఏ ముహూర్తాన అమరావతి అంశంపై బొత్స స్పందించారో కానీ, అప్పట్నుంచి రాష్ట్రంలో అసలైన అలజడి మొదలైంది. పార్టీలన్నీ రాజధాని మార్పుపై స్పందించడం మొదలుపెట్టాయి. అయితే ఈ క్రమంలో ఒకే తాను ముక్కలన్నీ ఒకే చోటుకు చేరడం స్పష్టంగా కనిపించింది. బొత్స వ్యాఖ్యలు ఇలా పార్టీల అసలు రంగును బయటపెట్టడానికి బాగా పనికొచ్చాయి.
అవును.. అమరావతి సాక్షిగా ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ ఒక్కటవుతున్నాయి. ఈ అంశంపై ఈ 3 పార్టీలు స్పందిస్తున్న విధానం చూస్తుంటే.. మరోసారి 2014 నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో ఈ మూడు పార్టీలు కలిసి చేసిన హంగామాను ఎవ్వరూ మరిచిపోలేరు.
తను పార్టీ పెట్టిందే బీజేపీ, టీడీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం అన్నట్టుగా ప్రచారం చేశారు పవన్ కల్యాణ్. అటు చంద్రబాబు కూడా మోడీతో పొత్తుకోసం అర్రులుచాచారు. అలా పవన్ చలవతో, మోడీ వేవ్ తో 2014లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. రోజులు గడిచేకొద్దీ తనకు ఎంతో అలవాటైన వెన్నుపోటు అస్త్రాన్ని వీళ్లపై కూడా ప్రయోగించడం మొదలుపెట్టారు. అలా పవన్, బీజేపీని దూరం చేసుకున్నారు. ఫలితంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.
తప్పు తెలుసుకున్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి జనసేన, బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పద్ధతి ప్రకారం రాజ్యసభ ఎంపీల్ని బీజేపీలో విలీనం చేశారనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో “దేశం” క్యాడర్ ను బీజేపీ తనవైపు తిప్పుకుంటున్నప్పటికీ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు చిరంజీవిని పొగుడుతూ పవన్ కు గాలం వేసే ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఇలా తెరవెనక ఈ 3 పార్టీలు ఒక్కటవుతూ వస్తున్నాయి.
తాజాగా అమరావతి ఇష్యూతో వీళ్ల అసలు రంగు బయటపడింది. కేవలం జగన్ ను టార్గెట్ చేయడం కోసం రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిపోయాయి. అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయి. త్వరలోనే ఈ 3 పార్టీలు కలిసి ప్రత్యక్ష పోరాటానికి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.