రాజకీయ నాయకులకు అస్తిత్వ ఫోబియా ఉంటుంది. అంటే తమను ప్రజలు మరచిపోతారేమో అనే భయం ఉంటుంది. నిత్యం ప్రజల్లో కనిపించకపోతే ప్రజలు మరచిపోతారని అనుకుంటారు. ఎప్పుడూ ఏదో ఒకరకంగా వార్తల్లో ఉండాలని అనుకుంటారు. కానీ.. అలాంటి వైఖరి అసలు లేనివారు కొందరుంటారు. ఈ ఫోబియాకు ఇంకో నిదర్శనం. వారి పార్టీ అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలకు , నిర్మాణాలకు పెట్టే పేర్లు కూడా! కానీ ఈ విషయంలో కేసీఆర్ తీరే వేరు!
ఏదో సంస్మరణ కోసం ఒకటీ రెండు పేర్లయితే మంచిదే. అవసరమే. కానీ, రాజీవ్ గాంధీని జనం మరచిపోతారని కాంగ్రెస్‌కు భయం. అందుకే దేశంలో సగం నిర్మాణాలకు ఆయన పేరు పెట్టేసింది. అలాగే తెలుగునేలపై ఎన్టీఆర్ పేరు, ఇతర నాయకులపేర్లు తెలుగునాట కనిపిస్తుంటాయి. ఇప్పుడు అన్న పథకాలన్నిటికీ రాజన్న పథకాలుగా పేరుమార్చాలనుకునే జగన్ ప్రయత్నం కూడా అలాంటిదే. కానీ కేసీఆర్ ఈ విషయంలో విలక్షణమైన తనముద్ర చూపిస్తున్నారు.
మిషన్ భగీరథ వంటి ఇంటింటికీ అవసరమయ్యే పథకానికి ఎవరైనా సరే.. తమ పార్టీ నేతల పేర్లు పెట్టుకోవాలని కలగంటారు. కానీ.. కేసీఆర్ భగీరథుడి పేరు పెట్టారు. తెలంగాణ ప్రముఖులను కూడా పట్టించుకోలేదు. ఆ సబ్జెక్ట్ ఏమిటో దానికి సంబంధించిన పేరే పెట్టారు. తాజాగా మరోసారి కూడా. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఆన్‌లైన్ మాధ్యంలో సమగ్రంగా సేవలందించేందుకు ఒక కొత్త యాప్ ను రూపొందించింది.
అందరికీ ఉపయోగకరమే గనుక.. తెలంగాణలో స్మార్ట్ ఫోను వినియోగించే ప్రతి ఒక్కరికీ ఇది చేరువ అవుతుంది. దీనికి తమకు వ్యక్తిగతంగా ఇమేజి పెంచే పేర్లను వారు ఆలోచించి ఉండొచ్చు. కానీ.. ఎంచక్కా జనులనే దేవుళ్లుగా చూస్తూ.. వారికి అధికారం అందించేంది గనుక.. దీనికి ‘‘జనతా జనార్దన్’’ అని పేరు పెట్టారు. అదే కేసీఆర్ విలక్షణ శైలి.
బహుశా ఇలాంటి పేర్లు పెట్టడానికి మరో కారణం కూడా ఉండొచ్చు. తెరాస ఎవ్వరి వారసత్వంతోగానీ, గతించిపోయిన నాయకుల ఇమేజితో గానీ బతుకుతున్న పార్టీ కాదు. బతికిఉన్న తన పేరు ఎందుకని కేసీఆర్ అనుకోవచ్చు. అదే చంద్రబాబు అయితే.. ‘చంద్రన్న బీమా’ అని పెట్టేసుకోగలరు. కేసీఆర్ అలా పాకులాడకుండా.. పథకం లక్షణాలని బట్టే పేర్లు పెట్టడం విశేషమే.