విశాఖ లాంగ్ మార్చ్ విజయవంతమైందని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఈ విజయంపై ఏకంగా ఓ సమీక్ష సమావేశం కూడా నిర్వహించి అందరినీ భేష్ అని పొగిడారు, పొగిడించుకున్నారు. కానీ ఇది మూడు పార్టీల కుట్ర అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే.
పేరుకి పవన్ కల్యాణ్ నిరసన ప్రదర్శనే అయినా ఆర్థిక సహాయ సహకారాలు అందించింది మాత్రం బీజేపీనే. ఇక జనసమీకరణకు సహకరించింది టీడీపీ. ఎర్రకండువాలు కూడా వీరితో జతకలిశాయి. మరి ఇన్ని శక్తులు కలిస్తే, రోడ్లపైకి జనాలు రాకుండా ఎందుకుంటారు? దీన్ని ప్రభుత్వ వైఫల్యంగానో, ప్రతిపక్ష విజయంగానో చూస్తామంటే అది వారి అల్ప సంతోషమేనని చెప్పాలి.
అన్నిటికంటే అల్పసంతోషం మరోటి ఉంది. అదే పవన్ కల్యాణ్ పోలిక. చంద్రబాబు నిరసన చేసినా, చినబాబు వచ్చినా ఇంతమంది జనాలు వచ్చి ఉండరు, నేను పిలుపిచ్చాను కాబట్టే విశాఖకు ఇంతమంది తరలి వచ్చారు. జనసేనకు జనాల్లో పెరుగుతున్న నమ్మకానికి ఇదే నిదర్శనం అంటూ పవన్ కల్యాణ్ పార్టీ నేతల అంతరంగిక సమావేశంలో వ్యాఖ్యానించారట. పవన్ కి బాకా ఊదేవారు చాలామంది అవునవును ఇది మన విజయం, చంద్రబాబు పాపులార్టీ తగ్గుతుంటే జనాల్లో మీ పాపులార్టీ పెరుగుతోందంటూ మరింతగా రెచ్చగొట్టారట.
కొంతమంది మాత్రం చంద్రబాబుతో పోల్చుకుంటే పర్లేదు కానీ, మరీ లోకేష్ తో పోల్చుకుని పవన్ సంతోష పడటం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు. అధికారం దక్కలేదు కాబట్టి పవన్ కల్యాణ్ కు ప్రజల్లో న్యూట్రల్ ఇమేజ్ ఉంది. అంతమాత్రాన దాన్ని తన విజయంగా భావించటం, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోంది అనుకోవడం కరెక్టేనా?
ఐదు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రజలు పవన్ పార్టీకి ఏ స్థానం ఇచ్చారో తెలియదా. నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న జనసేన ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వైసీపీ కంటే మాకే ప్రజాదరణ పెరుగుతోందని అనుకుంటే ఏంచేయాలి? చంద్రబాబు, చినబాబుతో పోల్చుకుంటూ పవన్ సంబరపడుతుంటే అది పవన్ ఆత్మవంచనే అవుతుంది తప్ప విజయానందం ఎంతమాత్రం కాదు.