శివసేనకు ఒకింత ఝలక్ ఇచ్చింది ఎన్సీపీ. తాము అధికార కూటమిలో భాగస్వామ్యులం కావాలని అనుకోవడం లేదంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఒక ప్రకటన చేశారు. ప్రజలు తమకు ప్రతిపక్ష హోదానే ఇచ్చారని, తాము ప్రతిపక్షంలోనే కూర్చోంటామని ఆయన ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీతో చర్చలు జరిపి, తాజా పరిస్థితుల గురించి మాట్లాడారట పవార్. తమకు ప్రత్యామ్నాయ మార్గం ఉందని శివసేన ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎన్సీపీ-కాంగ్రెస్ ల మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. ఆ మార్గానే శివసేన ప్రస్తావించింది. ఒక దశలో కాంగ్రెస్ వాళ్లు కూడా అందుకు సై అన్నట్టుగా మాట్లాడారు. ఎన్సీపీ అధినేత మాత్రం తమది ప్రతిపక్షవాసమే అని ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే కొందరు ఎన్సీపీ నేతలు సేనతో కలిసి ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో మొత్తం ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశారు పవార్.
సోనియాగాంధీతో సమావేశం అనంతరం మాట్లాడుతూ.. తమ కూటమి ప్రతిపక్షంలోనే ఉంటుందని ఆయన ప్రకటించారు. తద్వారా శివసేన పరోక్ష ప్రతిపాదనకు ఆయన నో చెప్పినట్టు అయ్యింది. ఇప్పుడు మహారాష్ట్రలో రెండే ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి బీజేపీ-శివసేనలు రాజీకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రెండు రాష్ట్రపతి పాలన!