తహశీల్దార్ అంటే మండల మేజిస్ట్రేట్. కేవలం రెవెన్యూ ఉద్యోగులే కాదు.. పోలీస్ డిపార్ట్ మెంట్, ఇతర శాఖల ఉద్యోగులు కూడా కొన్ని సందర్భాల్లో వారి ఆదేశాల ప్రకారం పనిచేయాల్సిందే. అలాంటి ఉన్నతాధికారిపై ఏకంగా హత్యాయత్నం, అది కూడా ప్రభుత్వ ఆఫీస్ లోనే అంటే.. అంతకంటే నీఛమైన పని, అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. కారణాలేవైనా కావొచ్చు.. కానీ ఓ మహిళా ఎమ్మార్వోని పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేయడం దారుణాతి దారుణమైన విషయం. ఇలాంటి ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు చోటు చేసుకున్న దాఖలాలు లేవు.
అసలు ఎమ్మార్వో స్థాయి అధికారులపై దాడులు చేయడం తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ హయాంలోనే మొదలైంది. ఇసుక మాఫియాని అడ్డుకున్నందుకు తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడం, ఆమెను కిందపడేయడం రాష్ట్ర చరిత్రకే కళంకమైన విషయం. అలాంటి దాడిని మసిపూసి మారేడుకాయ చేసి, చివరకు ఎమ్మార్వో పైనే తప్పు నెట్టేసి చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా వ్యవహరించిందీ అందరికీ తెలిసిందే.
బాబు అధికారం కోల్పోవడానికి ఈ ఘటన కూడా ఒక ప్రధాన కారణం. ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు రేపిన చింతమనేని దాడి ఘటన.. టీడీపీపై ఉద్యోగుల్లో ఒక రకమైన పగను రగిల్చింది. ఎన్నికల సమయంలో ఆ కసిని తీర్చుకున్నారు ఉద్యోగులు. వనజాక్షిపై దాడి చేసిన చింతమనేనిని అప్పుడే చంద్రబాబు కఠినంగా శిక్షించి ఉంటే.. ఆ శిక్ష తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనువిప్పుగా మారి ఉంటే.. ఇప్పుడిలాంటి దారుణాలు జరిగేవి కావు.
టీడీపీ హయాంలో.. ఇసుక మాఫియా వీఆర్వోలపై కూడా దాడులకు తెగబడింది. ఈ ఘటనలన్నిటితో అధికారులంటే ఒక రకంగా ప్రజలకు పలుచన భావం ఏర్పడింది. తహశీల్దారు విజయా రెడ్డి హత్యోదంతం విషయంలో కూడా సోషల్ మీడియాలో చింతమనేని దాడి ఘటనను ఉదాహరణగా చూపిస్తున్నారంటే ఆ దుర్మార్గం ఇంకా సామాన్యులు, ఉద్యోగులు మర్చిపోలేదనే చెప్పాలి.
అప్పటి టీడీపీ ప్రభుత్వ అలసత్వమే, ఇప్పటి దాడికి పరోక్ష కారణం అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. టీవీ చర్చల్లో పాల్గొన్న చాలామంది ఉద్యోగులు, పార్టీల నేతలు వనజాక్షి ఉదంతాన్నే ఉదాహరణగా చూపుతున్నారు. ఒకరకంగా చంద్రబాబుని మళ్లీ దోషిగా ప్రజా క్షేత్రంలో నిలబెడుతున్నారు. ఏదేమైనా ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. ఉద్యోగులకు తగిన భద్రత కల్పించాలి. పాలనలో పారదర్శకత తేవడం, ఉద్యోగుల్ని జవాబుదారీ చేయడంతో పాటు.. వారికి పనిచేసుకునే చోట తగిన రక్షణ కల్పించాలి.