అమరావతి పల్లెల్లో పర్యటన సందర్భంగా.. పవన్ కల్యాణ్ రెచ్చిపోయి కొన్ని ప్రకటనలు చేశారు. రాజధాని అనేది అమరావతి నుంచి ఎక్కడకీ తరలిపోదని, తరలి వెళ్లినా సరే వెనక్కు అమరావతికి తీసుకువస్తం అని ఆయన ప్రకటించారు. ప్రజలకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో.. ఎన్డీయేలో వైకాపా చేరడం కూడా జరగదని ఆయన జోస్యం చెప్పారు. అదే జరిగితే.. తాను భాజపాతో పొత్తును తెగతెంపులు చేసుకుంటానని కూడా అన్నారు.
సరిగ్గా ఇక్కడే పవన్ కల్యాణ్ మీద జోకులు పేలుతున్నాయి. వైకాపా అభిమానులు ఆయనకు బద్రి సినిమాను గుర్తు చేస్తున్నారు. పవన్ హీరోగా నటించిన ఆ చిత్రంలో.. ఓ ఫేమస్ డైలాగు ఉంటుంది. ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్ ఆఫీసుకు వచ్చి.. హీరోకు వార్నింగ్ ఇస్తాడు. ‘ఇంకోసారి నా చెల్లెలితో కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు’ అంటాడు. అప్పుడు దానికి హీరో చాలా ఆవేశంగా స్పందిస్తూ.. ‘ముందు ఏం చేయాలో డిసైడ్ చేసుకో.. ఎందుకంటే అదే జరుగుద్ది’ అని ఘాటుగా హెచ్చరిస్తాడు.
ఆ సినిమాలో పవన్ డైలాగును గుర్తు చేస్తూ.. ‘‘ముందు భాజపాతో తెగతెంపులు చేసుకో.. ఎందుకంటే వైకాపా ఎన్డీయేలో చేరడమే జరుగుద్ది’’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడుగానీ.. జాతీయస్థాయిలో తమ పార్టీ అవసరాలు చూసుకుంటుంది. దానికి తగ్గట్లుగానే అడుగులు మార్చుకుంటూ ఉంటుంది. ఒకవేళ వైకాపా తమతో కలిసి వచ్చేట్లయితే.. కేవలం 6 శాతం ఓటు బ్యాంకు ఉన్న పవన్ కల్యాణ్ తో వారికి పనేమిటి? పవన్ తమ జట్టులో ఉంటే ఎంత? పోతే ఎంత? అని మాత్రమే లెక్కలు వేసుకుంటుంది? అని పలువురు విశ్లేషిస్తున్నారు. వైకాపా కలిస్తే.. భాజపాతో తెగతెంపులు చేసుకునేట్లయితే.. పవన్ ముందుగానే అందుకు సిద్ధపడాలని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.