రాజధాని ప్రాంతం నుంచి కొంత మంది రైతులు జట్టుగా హైదరాబాద్‌కు వచ్చి జనసేన కార్యాలయంలో తనను కలిసి తమకు వార్షిక కౌలు కూడా చెల్లించలేదు అంటూ గోడు వెళ్లబోసుకున్నప్పుడు భలే మంచి పాయింట్ దొరికిందని పవన్ కళ్యాణ్ అనుకున్నట్లుంది. వెంటనే ఆయన స్పందించి.. రాజధాని గ్రామాలలో తాను పర్యటిస్తానని, రైతులకు మద్దతుగా పోరాడుతానని ప్రకటించేశారు. మాటమీద నిలబడి శుక్రవారంనాడు పర్యటనకు వెళ్లారు. కామెడీ ఏంటంటే.. ఈలోగా వార్షికకౌలు చెల్లింపులు సమస్య సమసిపోయింది. ఇక తను ఏ పాయింటు మీద పోరాడాలో.. అమరావతి పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ కు అర్థంకాలేదు.
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు బిల్లులు గతంలో ఎప్పుడూ ఆగస్టు సెప్టెంబరు నెలల్లోనే చెల్లిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో జగన్ పార్టీ ఉండేసరికి.. ఆగస్టు నెల పూర్తికాకముందే.. కౌలు చెల్లింపులు ఎగవేసినంతగా రాద్ధాంతం చేశారు. రాజధాని రోడ్ల మీద కూర్చుని ధర్నాలు చేశారు. కొందరు అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకువచ్చారు. పవన్ యాత్రకు ఆ రోజే రంగం సిద్ధమైంది.
గురువారం నాటి సీఆర్డీఏ భేటీ తర్వాత, రెండు రోజుల్లోగా కౌలు చెల్లింపులు పూర్తవుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. దాంతో పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వాన్ని తిట్టడానికి పాయింట్ దొరకకుండా పోయింది. రాజధానిని తరలిస్తున్నారు.. ఇది కరెక్ట్ కాదు.. అని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. సిఆర్డిఏ భేటీ తర్వాత, నిధుల వెసులుబాటు చూసుకుని పనులు కొనసాగిస్తాం అని మంత్రి ప్రకటించారే తప్ప, రాజధానిని మార్చడం గురించి ప్రస్తావించలేదు. దీంతో పవన్ కళ్యాణ్ కు ఆ కోణంలో నుంచి దాడి చేయడానికి కూడా అవకాశం లేకుండాపోయింది.
మంత్రులు గందరగోళం సృష్టించారు, అలాచేయడం తగదు అని ఆయన పరిమితం అయ్యారు. ఇలాంటి గందరగోళం సృష్టిస్తే ఊరుకోను అని ప్రభుత్వాన్ని బెదిరించడానికి కూడా ప్రయత్నించారు. అమరావతి పర్యటన పూర్తిచేసిన తరువాత పవన్ కళ్యాణ్ ను గమనిస్తే ఈరోజు ఎందుకు వచ్చాడో మరిచిపోయినట్టు కనిపిస్తోంది. దేనిమీద పోరాటం చేయాలో ఆయనకు అర్థంకాలేదు అని ప్రజలు అనుకుంటున్నారు.