పవన్ కల్యాణ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా విలయం యావత్ ప్రపంచాన్ని ముంచెత్తుతున్న వేళ.. ఆయన దేశంలో కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలు, సహాయక కార్యక్రమాలకోసం భారీ విరాళం ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయనిధికి ఏకంగా కోటిరూపాయల విరాళం ప్రకటించిన పవన్, తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి చెరి యాభై లక్షల వంతున ఇవ్వడం విశేషం. ఏపీలో ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తో పోల్చుకుంటే.. పవన్ కల్యాణ్ చాలా ఎక్కువ మొత్తం విరాళం ఇవ్వడం ద్వారా పెద్ద మనసు చాటుకున్నారని సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా విలయం యావద్దేశాన్ని స్తంభింపజేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయి ఉన్నారు. ఈ కర్ఫ్యూ వాతావరణం మరో 20 రోజుల పాటు కొనసాగనుంది. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి, అదే సమయంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకోవడానికరి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ముఖ్యమంత్రుల సహాయ నిధికి పెద్దమొత్తాల్లో విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఏపీలో సీఎం నిధికి తన కుటుంబం తరఫున 10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. తెదేపా ఎమ్మెల్యేలందరూ కూడా తమ నెలజీతం విరాళంగా ఇచ్చారు. అదే సమయంలో వైకాపా ఎంపీలు ఒక నెలజీతం సీఎం నిధికి, మరో నెల జీతం ప్రధాని నిధికి విరాళం ఇచ్చారు. కానీ చంద్రబాబు తన కుటుంబం తరఫున కేవలం పది లక్షలే ఇవ్వడం వల్ల ఒక పెద్ద నష్టం జరిగిందనేది పలువురి అభిప్రాయం. ఎందుకంటే.. తెదేపాలోని అంతకంటె పెద్ద మొత్తాలు ఇచ్చే ఉద్దేశం ఎవరికైనా ఉంటే.. తమ అధినేతకు మించి ఇవ్వడం, ఆయన ఆగ్రహానికి కారణం అవుతుందనే భయంతో.. వెనక్కు తగ్గే ప్రమాదం ఉంటుంది.
అయితే పవన్ కల్యాణ్ మాత్రం.. తన పెద్ద మనసు చాటుకుంటూ కేవలం కరోనా మీద పోరాటానికి రెండు కోట్ల రూపాయలు ప్రకటించారు. ఇటీవలే సైనిక సంక్షేమ నిధికి కూడా పవన్ కోటి రూపాయల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.