నిప్పులాంటి అధికారిగా, చిత్తశుద్ధి, నైతిక విలువలు గల వ్యక్తిగా విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకుని మరీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణకు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో లింకు దాదాపుగా తెగిపోయినట్లే! పార్టీకి సంబంధించి నంతవరకు ఆయన ఇక లేనట్లేనని… రాజకీయాల్లో కొనసాగితే.. యిక అది జేడీ లక్ష్మీనారాయణ సొంత వ్యవహారం అవుతుందని కూడా తెలుస్తోంది.
ఎన్నికల ముందే పార్టీలోకి ఆహ్వానించి, ఆ సమయానికి తమ పార్టీకి ఎంతో పాజిటివ్ గా కనిపించిన విశాఖపట్టణం లోక్ సభ సీటను కట్టబెట్టి, ఆయన విజయానికి తన వంతుగా చాలా కృషిచేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారు. జేడీ లక్ష్మీనారాయణ అంటే తెలియని తెలుగువాళ్లు చాలావరకు ఉండరు. ఒకప్పట్లో జగన్మోహన రెడ్డి మీద సీబీఐ విచారణ సందర్భంగా.. అత్యంత దూకుడు ప్రదర్శించడం ద్వారా ఆయన వార్తల్లో వ్యక్తి అయ్యారు. అయితే ‘నికార్సయిన జగన్ వ్యతిరేకి’ లాగా వ్యవహరిస్తూ… తదనుగుణంగా యెల్లో మీడియా ఆయనను ఆకాశానికెత్తేయడంతో హీరో ఇమేజి తెచ్చుకున్నారు.
జనసేన పార్టీ తరఫున పవన్ చాలాకాలం ముందునుంచి ఆయనకు సంకేతాలు పంపుతున్నప్పటికీ.. పట్టించుకోకుండా.. సరిగ్గా నామినేషన్లు ముగియడానికి కొన్నిరోజుల ముందు తెరపైకి వచ్చి విశాఖ సీటు తన్నుకుపోయారు. ఒకదశలో ఆయన విజయం గురించి పాజిటివ్ గా వినిపించింది కూడా. ఓడిపోయిన తర్వాత మాత్రం ఆయన జనసేనకు దూరంగా మెలగుతున్నారు. పవన్ కూడా దానికి తగ్గట్లుగానే… ఇటీవల ప్రకటించిన పలు కమిటీల్లో ఒక్కదానిలో కూడా ఆయనకు చోటు కల్పించలేదు.
ఇంతకంటె పెద్ద పోస్టు ఏదో దక్కుతుందని ఒక ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేదని ఇద్దరి మధ్య అగాథం పెరిగిందని తెలుస్తోంది. జేడీ లక్ష్మీనారాయణ భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతున్నదో తెలియదు గానీ.. జనసేన పార్టీకి సంబంధించినంత వరకు ఆయన ఎపిసోడ్ కు తెరపడిపోయినట్లే. పార్టీలో ఆయన ఊసు కూడా వినపడకుండా పవన్ కల్యాణ్ మొత్తం కట్టడి చేసేసినట్లు సమాచారం. మొత్తానికి జేడీ లక్ష్మీనారాయణ వ్యవహారం కంటెంట్ తక్కువ, హైప్ ఎక్కువ కావడం వల్ల ఫ్లాప్ అయిన తెలుగు సినిమా లాగా తయారైంది