పాక్ : చెరువు మీద అలిగితే చేటు ఎవరికి?

అనగనగా ఒక ఊరిలో ఒక ప్రబుద్ధుడు ఉన్నాడు. ఊరందరికీ తాగునీళ్లు అందించే చెరువు ఒకటి ఉంది. ఒక సందర్భంలో ఏదో కారణానికి సదరు ప్రబుద్ధుడికి ఆ చెరువు మీద కోపం వచ్చింది. ఇక జీవితంలో…

అనగనగా ఒక ఊరిలో ఒక ప్రబుద్ధుడు ఉన్నాడు. ఊరందరికీ తాగునీళ్లు అందించే చెరువు ఒకటి ఉంది. ఒక సందర్భంలో ఏదో కారణానికి సదరు ప్రబుద్ధుడికి ఆ చెరువు మీద కోపం వచ్చింది. ఇక జీవితంలో ఈ చెరువు నీటిని తాగను, వాడను అంటూ ప్రతిజ్ఞ చేశాడు. దాని ఫలితం ఏమవుతుంది.. తాగడానికి వంట చేసుకోడానికి ఇతర అవసరాలకు నీళ్లనేవే లేవు. కొన్నాళ్లు అలమటించి చచ్చాడు… ఇది కథ. ఇప్పుడు పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు, అక్కడి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయాలు ఈ కథ చందంగానే కనిపిస్తున్నాయి.

‘కాశ్మీరుకు సంబంధించి, 370 రద్దు చేయడం గురించి భారత్ తీసుకున్న నిర్ణయం కేవలం అంతర్గత సమస్య కాదు’ అని ఒక సభ్యుడు వ్యాఖ్యానించినందుకు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో అభాసుపాలైపోయింది. ఇలాంటి కాంగ్రెస్ మాటలు.. ఇమ్రాన్ కు కొత్త ఉత్సాహం ఇచ్చాయేమో తెలియదు. ఆయన ఈ వ్యవహారంపై మరింత తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి ఈ నిర్ణయాలన్నీ పాకిస్తాన్ కే చేటు చేసేవి. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ దుర్బుద్ధిని బయటపెట్టేవి. అన్యాపదేశంగా అయినా వారిని దోషిగా నిలబెట్టేవి.

తన దేశంలో జాతీయ భద్రత కమిటీతో సమావేశం అయిన తర్వాత.. భారత్ తో ద్వైపాక్షిక దౌత్య సంబంధాలను పూర్తిగా తగ్గించుకోవాలని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించారు. ఆ ప్రకారం.. తమ దేశంలో ఒక రాష్ట్రం గురించి భారత్ తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేస్తారట. రాయబారిని బహిష్కరిస్తారట, పాక్ లో ఉన్న భారత హైకమిషనర్ ను తిరిగి ఇండియా పంపేస్తారట. భారత్ లో పాక్ హైకమిషనర్ ను ఉంచబోరట. భారత్ తో వ్యాపార సంబంధాలను కూడా తగ్గించుకుంటారట… ఇవన్నీ ఇమ్రాన్ నిర్ణయాలు.

నిజానికి ఇలాంటి తెంపరితనం వల్ల ఆ దేశానికే నష్టం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భారత్ లోని భూభాగం జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్ ఇన్నాళ్లూ దుర్బుద్ధితో చూస్తున్నదని, అందుకే 370 రద్దు నిర్ణయం రాగానే సహించలేక దౌత్యసంబంధాలు కూడా చెడిపేసుకుంటోందని.. అంతర్జాతీయంగా అన్ని దేశాలూ గుర్తించే పరిస్థితి వస్తుంది. దీనివల్ల పాకిస్తాన్ మరింతగా ఒంటరి అవుతుంది. భారత్ ఎగుమతులు చేయకపోతే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టం. చైనా.. ఏదో తమ ప్రోడక్టులను అమ్ముకోడానికి, తమ తయారీ ఆయుధాలను అంటగట్టడానికి పాక్ కు మద్దతివ్వచ్చు గానీ.. పాక్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోడానికి సహకరించదని విశ్లేషకులు భావిస్తున్నారు.