ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదనంగా మరొక రోజు దేశ రాజధాని ఢిల్లీలోనే ఉండబోతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సీఎం, తన పర్యటనను పొడిగించుకున్నారు. దాంతో గురువారం నాడు అనంతపురం, కడప జిల్లాలలో షెడ్యూలు చేసిన ముఖ్యమంత్రి కార్యక్రమాలు రద్దయ్యాయి. సెప్టెంబరు 1,2 తేదీలకు వీటిని వాయిదా వేశారు. అయితే ట్విస్టు ఏంటంటే.. జగన్ ఢిల్లీలో అదనంగా ఒకరోజు ఉంటున్నారని తెలియగానే తెలుగుదేశం వర్గాలు కంగారు పడుతున్నాయి.
జగన్మోహన రెడ్డి తాను ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన వెంటనే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అరాచకాలు, తప్పుడు నిర్ణయాలు, అవినీతి కార్యకలాపాలపై విడివిడిగా విచారణకు ఆదేశించారు. ఒక్కొక్క వ్యవహారమూ నిగ్గు తేలుతున్నాయి. కరెంటు ఒప్పదాలనుంచి పోలవరం వరకు అన్నీ బయటకు వస్తున్నాయి. జగన్ ఈ పర్యటనలో కేంద్రంలోని బాధ్యులకు గత ప్రభుత్వ అవినీతిపై ఫిర్యాదు చేస్తున్నారన్నది స్పష్టం. ఆ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ఖండించడగం లేదు. తెలుగుదేశం పార్టీ వర్గాలు అందుకే తెగ కంగారు పడుతున్నాయి.
బుధవారం నాడు కార్యకర్తల సమావేశం నిర్వహించి.. అందులో చంద్రబాబునాయుడు ఆక్రోశం వెళ్లగక్కారు. ఢిల్లీ వెళ్లిన జగన్ నిధులు అడగడం మానేసి నాపై ఫిర్యాదులు చేస్తున్నాడంటూ ఆయన వాపోయారు. దానికి జవాబుగా.. ‘అవును మరి.. మీరు చేసిన అవినీతిపై ఫిర్యాదు చేయకుండా ఊరుకోవాలా’ అని వైకాపా ప్రశ్నించింది కూడా.
ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. జగన్మోహన రెడ్డి రెండు రోజుల టూర్ కే వెళ్లారు. అయితే ప్రాధాన్యాంశాల దృష్ట్యా ఆగాల్సి వచ్చింది. ఒకవైపు లోక్ సభలో 370 రద్దు గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలోనే ప్రధాని లోక్ సభలోని తన ఛాంబర్లో జగన్ ను కలవడానికి 45 నిమిషాల సమయం వెచ్చించారు. ఇది చిన్న సంగతేం కాదు. బుధవారం నిర్మలాసీతారామన్ తదితరులను కూడా జగన్ కలిశారు.
ఎటూ బుధవారం నాడు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. కేంద్రంలోని పెద్దలు గురువారం నాడు కాస్త ఖాళీగా ఉండే అవకాశం ఉంది. జగన్ తమ దృష్టికి తెచ్చిన అంశాల గురించి మరోసారి భేటీ అయి వివరాలు తెలుసుకుంటారని సమాచారం. అందుకే తెలుగుదేశం నాయకులందరూ కూడా తీవ్రంగా కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.