పాటిస్తామా లేదా అనేది తర్వాతి సంగతి. కానీ ప్రతి మనిషికీ.. ఎదుటివారు చెప్పింది వినే, ఆలకించే తత్వం ఉండాలి. ఎదుటివాళ్లు హితులైనా, శత్రువులైనా వారు చెప్పేది సలహా అయినా, విమర్శ అయినా ముందు దానిని వింటే.. వారు చెప్పే కోణాన్ని బేరీజు వేసుకుంటే.. తనను తాను మరింత ఉన్నతంగా, మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరికీ అవకాశం దొరుకుతుంది. కానీ… జనసేనాని పవన్ కల్యాణ్‌కు అసలు అనా ‘వినే’ అలవాటే లేదు. అందుకే అనన్యమైన ప్రజాదరణ ఉండి కూడా, ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నారు. పైగా, ఇప్పుడిప్పుడే ఆయనకు తత్వం బోధపడుతున్నట్లుగా కూడా ఉంది.
పవన్ తన పార్టీని నాలుగేళ్లపాటూ సుషుప్తావస్థలో ఉంచి జోకొట్టి, 2018లో ఒక్కసారిగా గేర్ మార్చి.. వీరోచితమైన మాటలు, హావభావాలతో చెలరేగిపోతున్నప్పుడు… చాలామంది సలహాల రూపంలో చెప్పారు. ఆ మాటలను కూడా ఆయన బహిరంగ వేదికల మీదినుంచి దెప్పిపొడుస్తూ… నా పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని అందరూ అంటున్నారు. నాయకత్వ లోపం ఉందని అంటున్నారు. నా పార్టీకి మీరంతా ఉన్నారు. నన్ను వందల మంది వచ్చి కలుస్తున్నారు. వారే నా పార్టీ నిర్మాణం. వారే నా బలం.. అంటూ నాటకీయమైన సినిమా డైలాగులు చెప్పారు.
ప్రజల ముందు ఎలాంటి డైలాగులైనా వల్లించవచ్చు గాక.. కానీ వాస్తవాన్ని తనైనా అర్థం చేసుకుని పార్టీ నిర్మాణం గురించి దృష్టిపెట్టి ఉండాల్సింది. ఇవాళ భీమవరం నుంచి చేసుకుంటున్న (ఆత్మ)సమీక్షల్లో ఆయన ఒక నిజం ఒప్పుకుంటున్నారు. పార్టీకోసం ప్రాణాలు ఇచ్చేంత కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు… వారిని అనుసంధానంచేసే నాయకులు ఉండే పార్టీ పరిస్థితి వేరుగా ఉండేది అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 2014లో నన్ను అర్థం చేసుకున్న నాయకులు అయిదుగురు నాకు తోడుగా నిలిచి ఉంటే జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఉండేది అని బీరాలు పలుకుతున్నారు.
ఆ విషయంలోనే పవన్ ఇంకా ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఆయన పార్టీకి ప్రజల్లో కొంత క్రేజ్ ఉన్నదని అందరూ భావిస్తున్న సమయంలో కొందరు నాయకులు ఇతర పార్టీల నుంచి ఆయనవైపు రావడానికి ప్రయత్నించినప్పుడు.. ఆయన పైన చూశారు. తేలిగ్గా తీసుకున్నారు. చివరికి ఆయన సీనియర్, వృద్ధ నాయకుల ఇళ్లకు వెళ్లి తమ పార్టీలో చేరమని బతిమాలినా కూడా వారు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది? ఇలాంటి దుస్థితి పార్టీకి కలగడానికి కేవలం పవన్ వైఖరే కారణం. ఇప్పటికైనా ఆయన మళ్లీ మరో మెరమెచ్చు మాటలతో ఆత్మవంచన చేసుకోకుండా ఒప్పుకుని, స్థిర నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు ఉంటుంది.