ఏదో సినిమాల్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు, అన్న చేయలేకపోయినా తమ్ముడు నమ్మకంగా చేస్తానంటున్నాడు, సీట్లు రాకపోయినా ఓట్లు చాలు పాతికేళ్ల పాటు రాజకీయ ప్రస్థానాన్ని కొసాగిస్తానన్నాడు.. ఇలాంటి ఓ సింపతీ పవన్ కల్యాణ్ పై కొంతమంది ప్రజల్లో ఉండేది. రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ ని చూసి తటస్థుల్లో జాలి, జనసైనికుల్లో ఆగ్రహం రెండూ సమపాళ్లలో కనిపించేవి. కానీ క్రమక్రమంగా ఆ సింపతీ పోతోంది, అందర్లో పవన్ అంటే అసహనం, కోపం పెరిగిపోతోంది.
తన స్వయంకృతాపరాథంతో సామాన్యుల మనసులకు దూరమవుతున్నారు జనసేనాని. ఎప్పుడైతే తన ఓటమిని ఓటుకు నోటుని లింకుపెట్టి మాట్లాడారో అప్పుడే పవన్ పై జనంలో చీత్కారం మొదలైంది. భీమవరంలో 150కోట్లతో జనాల్ని ప్రత్యర్థి పార్టీలు కొనేశాయని, ఓటర్లు నోట్లకు, మందుకి అమ్ముడుపోయారని చెప్పుకుంటూ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవాలని చూసినప్పుడే పవన్ ఏంటో ప్రజలకు బాగా అర్థమైంది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు, చివరకు ప్రజలపై నెపం నెట్టారు పవన్ కల్యాణ్.
ఆ తర్వాత ప్రత్యేకహోదా ఎపిసోడ్. తెలంగాణ ప్రజల్లా, ఏపీ జనాల్లో పోరాట పటిమలేదని, అదే ఉంటే.. అందరినీ కలుపుకొని తానెప్పుడో ప్రత్యేకహోదా తెచ్చేవాడినని నోరుజారారు పవన్. హోదా కోసం ప్రజలు పోరాడలేదని అందుకే రాలేదని తీరిగ్గా విశ్లేషించారు. ఇక్కడ కూడా ప్రజల దృష్టిలో చులకన అయ్యారు. ఇప్పుడు ప్రజావేదిక విషయంలో పవన్ చేసిన కామెంట్స్ మరోసారి అతడిపై చులకనభావం కలిగించేలా చేస్తున్నాయి.
రాజకీయ కక్షతోనే ప్రజావేదిక కూల్చివేస్తున్నట్టు పరోక్షంగా మాట్లాడారు పవన్. అక్రమ కట్టడాలు లేని ప్రదేశమే భారతదేశంలో లేదని, ప్రజావేదికను కూలుస్తున్నవారు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చేయాలని ప్రభుత్వానికి ఉచిత సలహా పారేశారు. అప్పుడే ఇది కక్షపూరిత చర్యకాదనే విషయాన్ని ప్రజలు నమ్ముతారంటూ మాట్లాడుతున్నారు పవన్. కేవలం ప్రజావేదిక కూల్చడం ఒక్కటేకాదు, కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటికీ ఇప్పటికే నోటీసులు అందించారు అధికారులు.
అక్రమ నిర్మాణాల్ని అరికట్టే ప్రక్రియను కరకట్ట నుంచి, పైగా ఓ ప్రభుత్వ భవనం నుంచి స్టార్ట్ చేశారు. ఈ అంశాల్ని మెచ్చుకోవాల్సింది పోయి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చేయాలంటూ పవన్ అనడం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బందిగా ఉందంటే ఏ అక్రమ కట్టడాన్నయినా కూల్చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని జగన్ కూడా ఐఏఎస్ ల మీటింగ్ లో చెప్పారు. కానీ ఈ అంశాల్ని ప్రస్తావించకుండా రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నారు పవన్. అందుకే ప్రజల్లో తనపై ఉన్న కొద్దిపాటి సింపతీని కూడా కోల్పోతున్నారు.