ఇక్కడ కూడా కేటీఆర్ ను ఫాలో అవ్వాలా లోకేష్!

ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్న టైమ్ లో వాళ్ల తనయుల మధ్య భలే పోటీ నడిచింది. కేటీఆర్ ఏం చేస్తే లోకేష్ అది చేసేవారు. లోకేష్ కు ఇష్టంలేకపోయినా దగ్గరుండి చంద్రబాబు…

ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్న టైమ్ లో వాళ్ల తనయుల మధ్య భలే పోటీ నడిచింది. కేటీఆర్ ఏం చేస్తే లోకేష్ అది చేసేవారు. లోకేష్ కు ఇష్టంలేకపోయినా దగ్గరుండి చంద్రబాబు ఆ పని చేయించేవారు. చివరికి మంత్రి పదవిలో కూడా కేటీఆర్ ను కాపీకొట్టారు చినబాబు. ఇప్పుడు అలాంటిదే మరో విషయంలో కూడా కేటీఆర్ ను అచ్చుగుద్దినట్టు ఫాలో అయిపోతున్నారు లోకేష్.

అవును.. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను నియమించేందుకు రంగం సిద్ధం అవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కేటీఆర్. కాబట్టి లోకేష్ ను కూడా తన పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు చంద్రబాబు. నిజానికి తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పదవి ఇప్పటివరకు లేదు. కానీ లోకేష్ కోసం సృష్టించారు. అది కూడా కేటీఆర్ తో ఎక్కడా తగ్గకూడదనే ఉద్దేశంతో.

అంతా బాగానే ఉంది కానీ ఈ విషయంలో మాత్రం లోకేష్ కు వ్యతిరేకత తప్పకపోవచ్చు. కొడుకుని ఎమ్మెల్సీని చేసి, దొడ్డిదారిన మంత్రిపదవులు కట్టబెట్టినప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు బాబు ముఖ్యమంత్రి. చేతిలో అధికారం ఉంది. కానీ ఇప్పుడు బాబు పరిస్థితి వేరు. టీడీపీ పరిస్థితి పూర్తిగా భిన్నం. కాబట్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తానంటే అసమ్మతి రేగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇప్పటికే పార్టీని సర్వనాశనం చేశారు లోకేష్. అలాంటి వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తే పార్టీ మరింత దిగజారిపోతుందని స్వయంగా టీడీపీ నేతలే విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్-లోకేష్ మధ్య పోలికలు తీస్తున్నారు. కేటీఆర్ కు ప్రజల్లో ఓ ఇమేజ్ ఉంది. పార్టీలో అంతకంటే పెద్ద ఇమేజ్ ఉంది. ఎన్నో విషయాల్లో అతడు తన సమర్థతను నిరూపించుకున్నాడు. ఇవన్నీ పక్కనపెడితే ప్రజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. వీటిలో ఒక్క క్వాలిటీ  కూడా లోకేష్ వద్ద లేవు.

మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు లోకేష్. ఇక ప్రజల్లో ఇమేజ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అతడ్ని ఒక పొలిటీషియన్ గా కంటే, కమెడియన్ గానే చూసే ప్రజలు ఎక్కువమంది. అటు మంత్రిగా కూడా కేటాయించిన శాఖలపై తనదైన ముద్రవేయలేకపోయారు. ఇక పార్టీలో కేవలం చంద్రబాబు తనయుడిగా గౌరవం తప్పితే, వ్యక్తిగతంగా లోకేష్ కు ఎలాంటి ఇమేజ్ లేదు. ఇలాంటి వ్యక్తిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తే కచ్చితంగా టీడీపీలో ముసలం రేగడం ఖాయం.

కళ్లముందు ఇన్ని విశ్లేషణలు కనిపిస్తున్నప్పటికీ, చంద్రబాబు మాత్రం తగ్గడంలేదు. కొడుక్కి పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కరకట్టపై ఉన్న తన నివాసాన్ని ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్లే పనుల్లో బిజీగా ఉన్నారు బాబు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుంది.

జగన్‌ విషయంలో కూడా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?