బీసీసీఐ ఏమీ రాజ్యాంగబద్ధమైన సంస్థకాదు, ప్రభుత్వంలో భాగంకాదు. అదొక స్వతంత్ర సంస్థ. అలాంటి బీసీసీఐకి ఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఏమనంటే.. వరల్డ్ కప్ కు పంపే జట్టుకు రెండు రకాల జెర్సీలు పంపమని ఐసీసీ అన్ని దేశాల బోర్డులనూ ఆదేశించింది. ఒక మ్యాచ్ కోసం ప్రత్యేకమైన జెర్సీతో బరిలోకి దిగాలని ఐసీసీ సూచించింది. ఆ మేరకు టీమిండియా కోసం ఆరెంజ్ జెర్సీని సిద్ధంచేసి పంపింది బీసీసీఐ.
క్రికెట్ అభిమానులకు అది ఉత్సాహభరితమైన అంశమే. కొత్త జెర్సీలో టీమిండియా ఎంత విభిన్నంగా ఉంటుంది అనేది వారిలో ఆసక్తిదాయకమైన అంశం. అయితే ఈ విషయంలోనూ రాజకీయాన్నే చూశాయి కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు!
టీమిండియా ను ఆరెంజ్ జెర్సీలో బరిలోకి దించడం ఏమిటి? దేశాన్ని కాషాయీకరణ చేయడం కాదా ఇది? అని ఆ రెండు పార్టీలూ ప్రశ్నిస్తూ ఉన్నాయి! ఆరెంజ్ జెర్సీలో అలా కాషాయికరణను చూశాయి ఆ పార్టీలు. ఈ విషయంలో అవి నిరసన తెలుపుతున్నాయి!
అయినా కాంగ్రెస్, ఎస్పీలు ఈ తరహా రాజకీయంతోనే ఇటీవలి ఎన్నికల్లో కూడా కోలుకోలేకపోయాయి. అయినా ఆ పార్టీల తీరులో మార్పు రాకపోవడం.. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ మోడీకి అడ్డుకట్టవేయాలని అనుకుంటున్నట్టుగా ఉన్నాయి.
ఆ పార్టీ విధానపరమైన అంశాల గురించి మాట్లాడకుండా.. ఆటలో అరటిపండ్ల గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఎస్పీ వంటి పార్టీలు తాము ఇప్పుడప్పుడే పుంజుకునే అవకాశాలు లేవని స్పష్టతను ఇస్తున్నాయి.