ఊహించని విధంగా ఓడిపోయారు పవన్ కల్యాణ్. కనీసం 10-12 సీట్లయినా వస్తాయని భావించినా కేవలం ఒక్క సీటుకే పరిమితమైపోయారు. మరీ ముఖ్యంగా అధ్యక్ష స్థానంలో ఉన్న తనే రెండు స్థానాల్లో ఓడిపోవడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తమ్మీద ఓటమి ఇప్పుడు అధికారికమైంది. మరి పవన్ నెక్ట్స్ ఏం చేయబోతున్నారు?
అంతా ఊహిస్తున్నట్టు తిరిగి సినిమాల్లోకి వెళ్లడానికి పవన్ మొగ్గుచూపడం లేదు. రానున్న ఐదేళ్లు రాజకీయాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తనపని తాను సక్రమంగా నిర్వర్తించేలా ప్రశ్నిస్తూనే ఉంటామని అంటున్నారు పవన్. కానీ పవన్ మాటలకు ప్రస్తుతం చేస్తున్న పనులకు పొంతన కనిపించడం లేదు. ఆల్రెడీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు జనసేనాని. మళ్లీ ఎప్పుడు ప్రజల ముందుకొస్తారో ఎవరికీ తెలియదు.
మరోవైపు పవన్ తిరిగి పార్టీని బతికించుకోవాలన్నా.. రాజకీయంగా కాస్తోకూస్తో నిలబడాలన్నా అతడు జగన్ అనుసరించిన మార్గాన్ని పాటించాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అవును.. గడిచిన ఐదేళ్లలో జగన్ ఎలాగైతే వ్యవహరించారో, అదే పద్ధతిని పవన్ ఫాలో అయితే బాగుంటుందని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్ తరహాలో పవన్ కూడా పాదయాత్ర చేయాల్సిన సమయం వచ్చిందంటున్నారు.
నిజమే.. పాదయాత్ర చేసిన నేతలెవరూ ఓడిపోలేదు. తాము గెలవడమే కాకుండా, పార్టీని బలోపేతం చేసుకున్నారు. అధికారాన్ని సొంతం చేసుకున్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్.. గతంలో పాదయాత్రలు చేశారు. ఆ యాత్రల తర్వాతే వాళ్లను అధికారం వరించింది. ఇప్పుడు అదే పద్ధతిని పవన్ కూడా ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు.
ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం 6.78శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఓడిపోయిన ఏ ప్రధాన పార్టీకి ఇంత తక్కువ ఓటు షేర్ లేదు. ప్రజారాజ్యంకు 17శాతం ఓట్లు పడ్డాయి. చివరికి లక్ష్మీపార్వతి స్థాపించిన ఎన్టీఆర్-టీడీపీ పార్టీకి కూడా గతంలో 12 శాతం ఓట్లు పోలయ్యాయి. వీటితో పోల్చుకుంటే జనసేన పార్టీకి వచ్చిన ఓట్ల శాతం చాలా తక్కువ. సో.. పవన్ అర్జెంటుగా తన ఓటుబ్యాంక్ ను పెంచుకోవాలి. దానికి పాదయాత్ర ఒక్కటే మార్గం అంటున్నారు విశ్లేషకులు. కానీ దానికింకా టైమ్ ఉంది.