భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవంతో పవన్

ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ వాయిస్ ఎంత రైజింగ్ లో ఉందో వినాల్సిందే తప్ప చెప్పే వ్యవహారం కాదు. ఎలా ముఖ్యమంత్రివి అవుతావో చూస్తా, ఎలా గెలుస్తావో చూస్తానంటూ జగన్ పై ఎగిరెగిరి పడేవారు…

ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ వాయిస్ ఎంత రైజింగ్ లో ఉందో వినాల్సిందే తప్ప చెప్పే వ్యవహారం కాదు. ఎలా ముఖ్యమంత్రివి అవుతావో చూస్తా, ఎలా గెలుస్తావో చూస్తానంటూ జగన్ పై ఎగిరెగిరి పడేవారు జనసేనాని. రాయలసీమ గూండాయిజం, రౌడీయిజాన్ని చూస్తూ ఊరుకోనని సినిమా స్టయిల్ వార్నింగ్స్ ఇచ్చారు. ఇక జనసేన ప్రకటనలైతే, అబ్బో పవన్ నిజంగానే గెలిచేసినట్టు, వైసీపీకి హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు ఉండేవి.

ఫలితాలు వచ్చాక మాత్రం పవన్ వాయిస్ బాగా పడిపోయింది. ఫ్రస్టేషన్లో జనసైనికులపై నోరు చేసుకోవడం తప్పితే సీఎం జగన్ పై కానీ, వైసీపీ పై కానీ నోరెత్తితే ఒట్టు. తాజాగా జనసేనాని పేరుతో విడుదలైన ఓ లేఖ చూస్తే అది  భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవంగా భావించాల్సిందే.

“రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం, లేకపోతే ఉప్పెనలు, ఉత్పాతాలు చూడాల్సి వస్తుంది, రైతుల పక్షాన ఎవరూ లేరని అనుకుంటే పొరపాటే.. నేనున్నాను, వాళ్లని కష్టపెడితే నేను రోడ్డుపైకి వస్తా” అని చెప్పాలనుకున్నారు పవన్. ఈ ప్రెస్ నోట్ చేస్తూ.. జనసేన పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో ఉందనే విషయం అర్థమౌతూనే ఉంది.

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బకాయిలు ఇంకా విడుదల చేయలేదని, విత్తనాల లభ్యత సరిగా లేదని, ప్రభుత్వం వెంటనే ఈ పరిస్థితిని సమీక్షించాలని, రైతులు రోడ్డెక్కే పరిస్థితులు తీసుకురావద్దని చాలా తక్కువ స్వరంలో రాసుకొచ్చారు. జనసేన, జనసేనాని శైలికి పూర్తి భిన్నంగా ఉంది ఇది. ఎక్కడా ఆవేశం, ఆక్రోశం, ఆయాసం.. ఏవీ లేవు.

మొత్తమ్మీద పవన్ శైలిలో మార్పు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ప్రతి దానికీ పోరాటం చేస్తా, అంతు చూస్తా అంటూ సినిమా డైలాగులు చెబితే కుదరదని పవన్ కి పూర్తిస్థాయిలో అర్థమైనట్టుంది. తాను ఎంత రెచ్చిపోయినా జనం విదిల్చే ఓట్ల సంఖ్య అంతేనని బాగా తెలిసొచ్చినట్టుంది. కంటెంట్ లేకపోతే ఎంత ఓవర్ యాక్షన్ చేసినా సినిమాని ఎవరూ చూడరు. అలాగే రాజకీయాల్లో కూడా మరీ ఓవర్ డ్రామా మంచిది కాదు, దానివల్ల ఎవరికీ ఉపయోగమూ లేదు.

ప్రభుత్వంతో పని చేయించుకోవాలంటే లోపాల్ని ఎత్తి చూపాలి, వాటికి గల కారణాలు విశదీకరించాలి, ఉపశమన మార్గాలు చూపించగలగాలి. అలా చేస్తేనే ప్రతిపక్షంగా తమ బాధ్యత నెరవేర్చినట్టు లెక్క. పవన్ కల్యాణ్ ఆ విషయాన్ని కాస్త ఆలస్యంగానైనా పూర్తిస్థాయిలో తెలుసుకున్నందుకు జనసైనికులు అదృష్టవంతులనే చెప్పాలి.

టీడీపీ ఎమ్మెల్యే, రాజీనామాకూ రెడీ? జగన్ ఒప్పుకుంటాడా?