పవన్ కల్యాణ్ ఇటీవల అనంతపూర్ లో పర్యటించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. త్వరలోనే తెలంగాణలో కూడా ఓ చిన్న పర్యటన పెట్టుకున్నారు. షూటింగ్స్ గ్యాప్స్ మధ్య పర్యటనలు ప్లాన్ చేసుకునే పవన్ కల్యాణ్, ఇంత షార్ట్ గ్యాప్ లో జనంతో ఉండటం కాస్త ఆశ్చర్యమే. ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే ఆందోళనతో పవన్ కి తెలివొచ్చిందా, లేక నిజంగానే షూటింగ్ లకు గ్యాపొచ్చిందా.. తేలాల్సి ఉంది.
పవన్ కల్యాణ్ సీజనల్ పాలిటిక్స్ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. పాతికేళ్ల ప్రస్థానం అంటారు, ప్రజలంతా తనకు సహకరించాలంటారు కానీ, ఆయనకు మాత్రం ఆ స్థాయిలో ఓపిక లేదు, పోనీ ఓపిక ఉన్నా తీరిక అస్సలు లేదు.
గతంలో ఉన్న కమిట్ మెంట్లు అన్నీ పూర్తయితే ప్రజలకే తన జీవితం అంకితం అన్న పవన్, ఆ తర్వాత కొత్తగా కాల్షీట్లిచ్చి కోట్ల రూపాయలు పారితోషికంగా పుచ్చుకుంటున్నారు. సీఎం జగన్ పరిపాలన బాగుంటే తాను సినిమాల్లోకి తిరిగెళ్లిపోతానని చెప్పిన పవన్, ఆ మాట నిలబెట్టుకున్నారని వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి. అయినా కూడా పవన్ సీజనల్ పాలిటిక్స్ కే పరిమితం అయ్యారు.
షూటింగ్ కి గ్యాప్ వచ్చినప్పుడు మాత్రమే ఆయన జనంలోకి వస్తారు. లేదా మేకోవర్ కోసం గ్యాప్ తీసుకోవాలనుకున్నప్పుడు జనంలోకి వచ్చి కాలం గడుపుతారు. హడావిడిగా అప్పుడే పవన్ కి సమస్యలన్నీ గుర్తొస్తాయి. కౌలు రైతుల ఆత్మహత్యలు మదిలో మెదులుతాయి. కానీ ఈసారి మాత్రం జనానికి ఆర్థిక సాయం చేస్తూ పవన్ కాస్త స్టైల్ మార్చారు. పనిలోపనిగా మేకోవర్ అవుతున్నారు.
తాజాగా ఆయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటన ఖరారు చేసుకున్నారు. జిల్లాలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం చేస్తారు. చింతలపూడి గ్రామంలో బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. దీని కోసం రూట్ మ్యాప్ రెడీ అయింది. త్వరలోనే తెలంగాణలో కూడా పర్యటించబోతున్నారు. ప్రాణాలు కోల్పోయిన ఓ జనసైనికుడి కుటుంబాన్ని ఓదార్చి, ఆర్థికంగా ఆదుకోబోతున్నారు.
మొత్తమ్మీద పవన్ కల్యాణ్ తీరిక చేసుకున్నారు. కౌలు రైతుల ఆర్థిక సాయం పేరుతో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. అయితే దీన్ని ఆయన ఇలానే కొనసాగిస్తారా లేక హరిహర వీరమల్లు అంటూ సెట్స్ పైకి వెళ్లిపోతారా అనేది తేలాల్సి ఉంది. షూటింగ్ ల మధ్య గ్యాప్ రావడం వల్లే పవన్ జనాల్లోకి వస్తున్నారా? మేకోవర్ కోసం తీసుకునే గ్యాప్ లో ఇలా రాజకీయాలు చేస్తున్నారా?