పవన్ కల్యాణ్ సాధారణంగా పక్కాగా సేకరించిన సమాచారంతో తయారుచేసుకున్న ప్రసంగాలనే మాట్లాడుతుంటారు. కానీ.. కొన్ని సందర్భాల్లో అనివార్యంగా సొంతంగా కూడా మాట్లాడాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు ఆయన దొరికిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో మాటలాడే ఫ్లోలో రెచ్చిపోతుంటారు. అలాంటప్పుడు కూడా ఆయనలోని అజ్ఞానం బయటపడిపోతుంటుంది. తాజాగా అలాంటిదే జరిగింది.
తెలుగుదేశం, భాజపాలతో మళ్లీ జట్టుకట్టి ఊరేగడానికి సిద్ధపడుతున్న పవన్ కల్యాణ్.. అందుకోసం ప్రజల్లోకి సంకేతాలు వదలదలచుకున్నారు. మేం విడిపోవడం వల్ల మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని ఆయన అన్నారు. ఏరకంగా వాస్తవాలను పరిశీలించినా ఇంతకంటె అబద్ధం మరొకటి ఉండదు. అందుకే ఆయన ఈ రకంగా తన అజ్ఞానాన్ని తాజాగా బయటపెట్టుకుంటున్నట్లు ప్రజలు భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే…
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు విడివిడిగా పోటీచేశాయి. 2014లో మూడు పార్టీలు కలిసి జగన్ ను ఓడించాయి. ఆ మూడూ 2019 నాటికి విడిపోయాయి. ‘కొన్ని కారణాలు’ అంటూ పవన్ ఆ మర్మం దాటవేశారు. ఈ నేపథ్యంలో జగన్ పార్టీ అఖండ విజయం సాధించింది. అయితే తాము విడిపోవడం వల్ల మాత్రమే జగన్ గెలిచాడని పవన్ అంటున్నారు. ఆయన ఏ అవగాహనతో అలా మాట్లాడుతున్నారో తెలియడం లేదు.
2018లో గెలిచిన వైకాపాకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,56,83,592 ఓట్లు లభించాయి. ఇది మొత్తం పోలయిన ఓట్లలో 49.95 శాతం. తెలుగుదేశానికి లభించిన ఓట్ల మొత్తం 1,23,01,741 మాత్రమే. తెదేపా ఓట్లు 39.61 శాతం. అధికారంలోకి వచ్చేస్తున్నాం అని ప్రగల్భాలు పలుకుతూ బరిలోకి సొంతంగా దిగిన జనసేనకు లభించింది… కేవలం 21,30,367 ఓట్లు అంటే 6.78 శాతం. ఇకపోతే.. మేం ముగ్గురం అంటూ పవన్ కల్యాణ్ ప్రాధాన్యం కట్టబెడుతున్న భారతీయ జనతా పార్టీ తెచ్చుకున్నది.. 0.84 శాతం ఓట్లే. అంటే 2,63,849 ఓట్లు మాత్రమే. ఇప్పుడు లెక్క తీస్తే ఈ మూడు పార్టీలు కలిపి 1,46,95,957 ఓట్లు మాత్రమే సాధించాయి. అంటే ఈ మూడు పార్టీలు కలిపి సాధించిన వాటికంటె 9,87,635 ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికంగా లభించాయి. పవన్ కల్యాణ్ ఆ అవగాహన లేదో.. లేక, లెక్కలు తెలియదో… లేక, తాను ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారో గానీ.. ఈ రకంగా ఆయన తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారు. గణాంకాల సాక్షిగా ఆయన చెప్పినట్లు ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేసి ఉన్నా సరే.. వైకాపానే గెలిచి ఉండేదనడంలో సందేహం లేదు.