త్రివిక్రమ్ ఎలా డైలాగ్స్ రాస్తాడు.. ఎక్కడ రాస్తాడు?

మాటల మాంత్రికుడు అనే బిరుదు ఉంది. మరి అలాంటి దర్శకుడు తూటాల్లాంటి మాటలు రాయడానికి ఎలాంటి హోమ్ వర్క్ చేస్తాడు. కథలు, డైలాగ్స్ రాయడానికి ఎక్కడికి వెళ్తాడు. ఇది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చాలామందికి ఉంటుంది.…

మాటల మాంత్రికుడు అనే బిరుదు ఉంది. మరి అలాంటి దర్శకుడు తూటాల్లాంటి మాటలు రాయడానికి ఎలాంటి హోమ్ వర్క్ చేస్తాడు. కథలు, డైలాగ్స్ రాయడానికి ఎక్కడికి వెళ్తాడు. ఇది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చాలామందికి ఉంటుంది. ఎట్టకేలకు తన వర్కింగ్ స్టయిల్ పై స్పందించాడు త్రివిక్రమ్. ఇంట్లోనే ఓ మూల కూర్చొని పని చేసుకుంటానంటున్నాడు.

“రైటింగ్ గురించి నిజంగా నేను ఆలోచించను. ఇది మీరంతా నమ్మి తీరాలి. స్పాంటేనియస్ రైటర్ ను నేను. ఓ మంచి ప్రదేశం లేదా విదేశానికి వెళ్లి కాఫీ తాగుతూ, ఏదో తింటూ రాయాలని నేను అనుకోను. నిర్మాత మన కోసం ఇంత ఖర్చు పెడుతున్నాడనే ఒత్తిడితో అస్సలు రాయలేను. నేను మామూలుగా మా ఇంట్లో ఓ మూల కూర్చొని రాసుకుంటాను.”

తను పని చేసుకునేటప్పుడు పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారని, అలా చాలా సహజమైన పరిస్థితుల మధ్య రాసుకుంటానని, ప్రత్యేకంగా ఎలాంటి సెటప్స్ ఉండవని చెబుతున్నాడు త్రివిక్రమ్. అలా తేలికగా పనిచేయడమే తనకు ఇష్టం అంటున్నాడు.

“నేను నా పని చేసుకుంటున్నప్పుడు పిల్లలు, నా భార్య వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు. నేను రాసుకుంటున్నానని వాళ్లు ఆలోచించరు, వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు. నేనేదో సీరియస్ గా పనిచేసుకుంటున్నాననే ఫీలింగ్ మా పిల్లలకు  వచ్చినా నాకు నచ్చదు. అలాంటి కండిషన్ల మధ్య నేను కథలు, డైలాగ్స్ రాస్తుంటాను. ఇలా చాలా ఈజీగా, ప్రశాంతంగా, తేలికగా పనిచేయడానికి ఇష్టపడతాను. నా రైటింగ్ ఎట్మాస్ఫియన్ ఇలానే ఉంటుంది.”

కథ రాయడానికి బ్యాంకాక్ లేదా గోవా వెళ్తుంటాడు పూరి జగన్నాధ్. అనీల్ రావిపూడి కూడా తనకు ఇష్టమైన అరుకు వెళ్తుంటాడు. ఇలా చాలామంది దర్శకులు కథలు, డైలాగ్స్ రాయడం కోసం రకరకాల ప్రదేశాలు వెదుక్కుంటారు. అయితే త్రివిక్రమ్ మాత్రం తను ఇంట్లోనే కూర్చొని పని చేసుకుంటానని, డైలాగ్స్ కూడా అప్పటికప్పుడు తట్టినవి రాసుకుంటానని అంటున్నాడు.