ప్రజల్ని మోసగించడంలో బీజేపీకి ఏ పార్టీ సాటి వచ్చేలా లేదు. ఈ విషయాన్ని శనివారం విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం మరోసారి నిరూపించింది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఏపీలో ఏ మాత్రం బలం లేకపోయినా, నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాకపోయినా…పెత్తనం చేయడానికి మాత్రం కాచుకుని ఉంది. తప్పును సరిదిద్దాల్సింది పోయి దానికి వత్తాసు పలకడం ఒక్క బీజేపీకే చెల్లింది.
ఏపీ రాజధానుల రచ్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకొంది. సమావేశం అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ ‘శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు బుట్ట దాఖలు చేసి ప్రజలను మోసం చేశాడు. కమిటీ నివేదికను చర్చించకుండా చంద్రబాబు స్వలాభాపేక్షతో రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారు. కుట్రపూరితంగా రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించడం మోసపూరిత ఆలోచనలకు నిదర్శనం. లక్ష కోట్లతో సింగపూర్ స్థాయి రాజధాని నిర్మాణం పూర్తి కాదని శివరామకృష్ణన్ కమిటీ తేల్చి చెప్పింది. అమరావతిలో రాజధాని నిర్మాణం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడుతుందని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు’ అంటూ మండిపడ్డాడు.
చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను తప్పు పడుతూనే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అందుకోసం పోరాడుతామని బీజేపీ ప్రకటించడంలో ఔచిత్యం ఏంటి? రాజధాని ఏర్పాటు కోసం నాటి కేంద్రప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను బాబు బుట్టదాఖలు చేసి, ఎవరి నివేదిక ఆధారంగా రాజధాని నిర్మించారో బీజేపీకి తెలియదా? నాడు బాబు తీసుకున్న అప్రజాస్వామిక నిర్ణయాల్లో బీజేపీ పాత్ర లేదా? అందుకేనా ఇప్పుడు అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేయడం? స‌్వలాభాపేక్షతో రాజధానిని చంద్రబాబు ఏర్పాటు చేశారని చెబుతూనే, అదే నోటితో దాన్నే కొనసాగించాలని డిమాండ్ చేయడంలో మర్మం ఏంటి?
కుట్రపూరితంగా రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించడం మోసపూరిత ఆలోచనలకు నిదర్శనం అని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు…అమరావతినే కొనసాగించాలని తీర్మానం చేయడం అంటే చంద్రబాబు విధానాలకు వత్తాసు పలకడం కాదా?
బీజేపీలో ఏంటీ ద్వంద్వ ప్రమాణాలు? ప‌్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిపై అంత మమకారం ఉంటే, ఇదే ప్రధాని అభ్యర్థిగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షిగా తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కడం వాస్తవం కాదా? వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ప్రత్యేక నిధులను మంజూరు చేయకపోవడం నిజం కాదా? జనాల్ని మోసగించడంలో బీజేపీ…‘సరిలేరు నీకెవ్వరూ’ అంటే తప్పా?