'ఈయనేం ఎన్నికల కమిషనరండీ బాబూ!..' ఇదీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి సామాన్యులు అనుకుంటున్న మాట! ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు నాయుడి సన్నిహితులుగా పేరు పొందిన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ వంటి వాళ్లతో ఆయన సమావేశానికి సంబంధించిన వార్తల నేపథ్యంలో సామాన్యులు ఈ అంశం గురించి ఆసక్తిదాయకంగా చర్చించుకుంటూ ఉన్నారు.
నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రజల్లో ఇంత విస్తృత చర్చ జరగడానికి కారణం స్థానిక ఎన్నికలు. స్థానిక ఎన్నికలను హఠాత్తుగా వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించిన దగ్గర నుంచి నిమ్మగడ్డ తీరుపై సామాన్యుల్లో చర్చ జరుగుతూనే ఉంది. మామూలుగా స్టేట్ ఈసీ ఎవరనేది క్షేత్ర స్థాయిలో ప్రజలు పట్టించుకునే అంశం కాదు. అయితే అప్పటికే జనాలు పూర్తిగా స్థానిక ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిన దశలో, నామినేషన్లు కూడా దాఖలైపోయిన దశలో నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంతో ఆయన గురించి సామాన్యుల్లోనూ చర్చ మొదలైంది.
ఆ తర్వాత ప్రతి పరిణామం కూడా వాళ్లలో చర్చగా కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో నిమ్మగడ్డ ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో పదవి కోల్పోవడం, ఆ తర్వాత కోర్టులో సాగుతున్న పరిణామాలూ.. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రజల్లో చర్చగానే ఉన్నాయి. ఇక నిమ్మగడ్డ వ్యవహారంలో కులం కోణం కూడా మొదటి నుంచి చర్చగా ఉంది. ఇలాంటి క్రమంలో.. ఆయన కమ్మ కులస్తులైన నేతలతో , అది కూడా అత్యంత ఖరీదైన స్టార్ హోటల్లో సమావేశం కావడం పై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
తాము వ్యక్తిగత కారణాలతో సమావేశం అయినట్టుగా వారు చెప్పుకుంటున్నా, ఎస్ఈసీ హోదా లో ఉండిన వ్యక్తి, ఆ హోదా కోసం పోరాడుతున్న వ్యక్తి మరీ ఇలా చంద్రబాబు సన్నిహితులతో ప్రైవేట్ మీటింగులో పాల్గొన్నారు అనే వార్తను ప్రజలే ఛీదరించుకుంటున్నారు. ఎన్నికల కమిషనర్ అంటే ఎలా ఉండాలో ప్రజలకు తెలియనిది ఏమీ కాదు. ఇలాంటి నేపథ్యంలో ఈయన మరీ ఇలాంటి మీటింగులు పెట్టేసుకుంటున్నారా..! అని వారు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఈయన పక్కా చంద్రబాబు మనిషే అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇన్నాళ్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఆరోపణకు చౌదర్ల మీటింగ్ మరింత ఊతం ఇచ్చిందని, నిమ్మగడ్డ నిస్పాక్షింగా వ్యవహరిస్తారనే నమ్మకం ప్రజల్లో పూర్తిగా పోయినట్టుగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.