అయ్యోపాపం.. పవన్‌ను చూస్తే జాలేస్తోంది!!

జనసేనాని పవన్ కల్యాణ్ ను చూస్తే ఒక రకంగా జాలి కలుగుతోంది. ఆయన ఏదో ఆవేశంలో ‘మట్టిలో కలిసిపోతారు’ అన్నారని బొత్స విమర్శిస్తే.. ఆవేశంకాదు ఆలోచించి అన్నానని పవన్ కౌంటర్ ఇచ్చారు. కానీ.. దీన్ని బట్టి…

జనసేనాని పవన్ కల్యాణ్ ను చూస్తే ఒక రకంగా జాలి కలుగుతోంది. ఆయన ఏదో ఆవేశంలో ‘మట్టిలో కలిసిపోతారు’ అన్నారని బొత్స విమర్శిస్తే.. ఆవేశంకాదు ఆలోచించి అన్నానని పవన్ కౌంటర్ ఇచ్చారు. కానీ.. దీన్ని బట్టి అర్థమవుతున్నదేంటంటే.. పవన్ ఎంత సేపు ఆలోచించినా కూడా ఆయనలో ఆవేశం మిగులుతుందే తప్ప.. ఆలోచన తాలూకు ఫలితం కనిపించదు. అందుకనే ఆయన కామెంట్లు ఆయన తనస్థాయిని తాను స్వయంగా దిగజార్చుకునేలా ఉంటాయి!

పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి జగన్మోహనరెడ్డి విమర్శించారు. అక్కడికి పవన్ ను ఎద్దేవా చేయడానికి మరే ఇతర అంశమూ లేనట్లుగా జగన్, పెళ్లిళ్ల గురించి మాట్లాడడమే నేలబారు విమర్శ! ఆ విమర్శలను పట్టుకుని.. నువ్వుకూడా మూడు పెళ్లిళ్లు చేసుకో.. అంటూ పవన్ మరింత లేకితనం ప్రదర్శించారు. జగన్ విమర్శలను రకరకాలుగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

జగన్ కు మద్దతుగా మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ పవన్ మీద ఎదురుదాడికి దిగారు. తిరిగి వారికి కౌంటర్ ఇవ్వాలి? జనసేన తరఫున ఎవరు ఆ పనిచేయాలి? మళ్లీ పవన్ కల్యాణే మీడియా ముందుకు వచ్చారు. సరిగ్గా.. ఇక్కడే ఆయనను చూస్తే జాలేస్తోంది.

సాధారణంగా రాజకీయ నాయకులు ఒక ‘స్థాయి’ని మెయింటైన్ చేస్తుంటారు. జగన్ తనను తిడితే తిరిగి చంద్రబాబు తిడతాడు. బొత్స తనను తిడితే.. దానికి కౌంటర్‌గా ఏ అచ్చెన్నాయుడో జగన్ ను తిడతాడు. అలాగే ఏ స్థాయి వాడు చేసిన విమర్శకు, ఆ స్థాయి వాడితోనే కౌంటర్‌లు ఇప్పిస్తుంటారు. అంతే తప్ప ప్రతి విమర్శకూ అగ్ర నాయకులు స్వయంగా స్పందించరు. తద్వారా నా స్థాయి వారి విమర్శలకు మాత్రమే నేను స్పందిస్తాను… అని వారు సంకేతాలు ఇస్తుంటారు.

జగన్ తిడితే.. పవన్ ఎదురు తిట్టారు ఓకే. బొత్స, పేర్నినాని తిడితే… ఎవరు స్పందించాలి? జనసేన పార్టీకి మరొక దిక్కు లేదు! ఇది అత్యంత జాలిగొలిపే విషయం. నాదెండ్ల మనోహర్ ఉన్నారు గానీ.. ఆయన మేథోనాయకుడు మాత్రమే. ఆయన పార్టీ విధానాలను విమర్శలను  ప్రణాళికా బద్ధంగా రూపొందించే మేథో కార్యక్రమం  మాత్రమే చేస్తాడు. అంతే తప్ప.. ఇలా ప్రెస్ మీట్లో విమర్శల జోలికి రాడు. పార్టీలో మరొక దిక్కు లేదు. దేవుడా అంటూ మళ్లీ పవన్ మీడియా ముందుకు రావాల్సిందే.

పార్టీ స్థాపించి ఆరేళ్లవుతోంది… యాక్టివ్ రాజకీయాలు చేయబట్టి ఏడాదిన్నర అవుతోంది. ఇంకా ప్రెస్ ముందు మాట్లాడడానికి ఒక నాయకుడు కూడా దిక్కు లేదంటే.. ఆ పార్టీ దుర్గతిని ఏమనుకోవాలి? అందుకే అయ్యోపాపం పవన్!!