ఇంగ్లిష్ మీడియంపై సీఎం జగన్ సమగ్ర ప్రకటన

ఇంగ్లిష్ మీడియం.. ఈ ఒక్క అంశాన్ని ఎంత వివాదాస్పదం చేయాలో అంతా చేశాయి ప్రతిపక్షాలు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ దీనిపై లేనిపోని అపోహలు సృష్టించారు. జాతి నాశనం అయిపోతోందని, తరాలు పాడైపోతాయని, తెలుగు…

ఇంగ్లిష్ మీడియం.. ఈ ఒక్క అంశాన్ని ఎంత వివాదాస్పదం చేయాలో అంతా చేశాయి ప్రతిపక్షాలు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ దీనిపై లేనిపోని అపోహలు సృష్టించారు. జాతి నాశనం అయిపోతోందని, తరాలు పాడైపోతాయని, తెలుగు నేల కలుషితం అంటూ ఏవేవో మాట్లాడారు. దీనికి చంద్రబాబు, అతడి అనుకూల మీడియా వంతపాడింది. 

ఇలా అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ సవివరణ ప్రకటన చేశారు. ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ.. ఇంగ్లిష్ మీడియంను అమలుచేసే అంశంపై తన స్పష్టమైన ప్రణాళికను, లక్ష్యాన్ని వెల్లడించారు. “మన బడి నాడు-నేడు” కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే అంశంపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టంచేశారు.

“ప్రతి స్కూల్ ను ఇంగ్లిష్ మీడియంగా మార్చబోతున్నాం. అంతేకాదు, ప్రతి పాఠశాలలో తెలుగు మీడియం కూడా ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చేస్తాం. ఆ తర్వాత 7వ తరగతి, ఆ తర్వాత 8వ తరగతి.. ఇలా ఏడాదికో తరగతిని ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తాం. టెన్త్ లో సీబీఎస్ఈ లాంటి కామన్ ఎగ్జామ్ రాసే టైమ్ కు అక్షరాలా పిల్లలకు నాలుగేళ్లు గడువు ఉంటుంది. ఈ నాలుగేళ్లలో పిల్లాడు కిందామీదా పడతాడు. మనం అన్నిరకాలుగా తోడుగా ఉంటాం. ముందు కొంచెం కష్టపడినా నాలుగేళ్లలో పిల్లాడు రాటుదేలుతాడు.”

ఇలా తన ప్రణాళికను స్పష్టంగా వివరించారు ముఖ్యమంత్రి జగన్.  కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా.. తల్లిదండ్రుల్ని కూడా ఇందులో భాగస్వాముల్ని చేస్తామని.. ప్రతి పాఠశాలకు పేరెంట్ కమిటీలు ఏర్పాటుచేస్తామని జగన్ స్పష్టంచేశారు. ఇంగ్లిష్ మీడియం అమలుతో పాటు మౌలిక వసతుల కల్పనపై తల్లిదండ్రుల కమిటీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తుందని తెలిపారు. అంతేకాకుండా.. టీచర్లకు కూడా ప్రత్యేక ట్రయినింగ్ ఇస్తామని ప్రకటించారు.

“టీచర్లకు ఇంగ్లిష్ సరిగా రాదు కదా, వాళ్లు ఎలా చెప్పగలరు అనే సవాల్ ఉంది. అవును నిజమే. టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తాం. పిల్లలకు కూడా ఒకేసారి 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చేస్తే వెంటనే అడాప్ట్ కాగలరా అనే ఛాలెంజ్ ఉంది. దీనికోసం బ్రిడ్జి కోర్సులు ఏర్పాటుచేసి పిల్లలకు తోడుగా ఉంటాం. ప్రతి స్కూల్ లో ఇంగ్లిష్ ల్యాబ్ పెడతాం. సిలబస్ మారుతుందనే ఛాలెంజ్ కూడా ఉంది. దీన్ని కూడా సవాల్ గా తీసుకొని పనిచేస్తాం.”

ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు సవాళ్లను స్వీకరించాలని.. పాఠశాల విద్యకు సంబంధించి ఆ సవాల్ ను తను స్వీకరించానని తెలిపారు జగన్. ఎన్నాళ్లిలా పేద విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంకు దూరంగా ఉండాలని ప్రతిపక్షాల్ని ప్రశ్నించారు. 

“సవాళ్లను ఎదుర్కోవాలి. మొదటి సంవత్సరం కష్టపడతాడు, రెండో సంవత్సరం కూడా కష్టపడతాడు, కానీ మూడో ఏడాదికి చదవగలుగుతాడు. నాలుగో ఏడాదికి గాడిలో పడతాడు. అలా 10వ తరగతికి పరీక్షలు ఇంగ్లిష్ లో రాస్తాడు. ఇలాంటి సవాళ్లు ఉంటాయని పిల్లల్ని గాలికి వదిలేస్తే, వాళ్ల తలరాతలు మారవు. భవిష్యత్తులో వాళ్లు ప్రపంచంతో పోటీపడాలంటే ఇప్పుడీ సవాళ్లను స్వీకరించాల్సిందే.”

రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో ఉన్న 45వేల పాఠశాలల రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు జగన్. ఏడాదికి 15వేల స్కూల్స్ చొప్పున తీసుకొని వాటికి 3500 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నాలుగో ఏడాది నాటికి పాఠశాలల్లో మార్పు రావడంతో పాటు విద్యార్థులు కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారుతారనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు ముఖ్యమంత్రి.