కుల రొచ్చులో దొర్లుతూ.. పవన్ కుల నీతులు!

మాటెత్తితే కులం గురించినే మాట్లాడుతూ.. మళ్లీ తను కుల రాజకీయాలను చేయడం లేదని ప్రకటించుకోవడం పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న కుటిల రాజకీయం. ఎన్నికలకు ముందు నుంచి కూడా పవన్ కల్యాణ్ కులం గురించినే మాట్లాడుతూ…

మాటెత్తితే కులం గురించినే మాట్లాడుతూ.. మళ్లీ తను కుల రాజకీయాలను చేయడం లేదని ప్రకటించుకోవడం పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న కుటిల రాజకీయం. ఎన్నికలకు ముందు నుంచి కూడా పవన్ కల్యాణ్ కులం గురించినే మాట్లాడుతూ వచ్చారు. తను ఏరుకుని రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడంలో కూడా పవన్ కల్యాణ్ కుల సమీకరణాలే తప్ప మరోటి లేవనేది బహిరంగ రహస్యం!

ఇక పవన్ కల్యాణ్ ప్రచార పర్వాన్ని గమనించినా.. కేవలం తన కులస్తులు గట్టిగా ఉన్న చోట మాత్రమే పవన్ ఎన్నికల ప్రచారం సాగింది. రాయలసీమకు వెళ్లి అక్కడ జనసేన అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేసింది కూడా లేదు. ఏదో నామమాత్రంగా అక్కడ ప్రచారం చేశారు.

ఇక ఇటీవలి రాయలసీమ పర్యటనలో కూడా కేవలం తన కులస్తుల జనాభా ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే పవన్ కనిపించారు. అవన్నీ ఒక ఎత్తు అయితే.. పవన్ కల్యాణ్.. కులాలను, మతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీకి దగ్గరయిపోవడానికి మత రాజకీయాలను, తన రాజకీయ సమీకరణాల కోసం కుల రాజకీయాలను పవన్ చేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయని సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో కుల రొచ్చులో దొర్లుతూ..పవన్ కల్యాణ్ మళ్లీ నీతులు చెబుతూ ఉన్నారు. కుల రాజకీయాలకు కాలం చెల్లిందన్నట్టుగా పవన్ వ్యాఖ్యానించారు. బహుశా తన సందేశాన్ని తనే అర్థం చేసుకుంటే మంచిదేమో జనసేన అధినేత.

పవన్ కల్యాణ్ ఈ ప్రకటన చేసినప్పుడు కూడా కుల కలమే రేపారు. 'ప్రకాష్ రెడ్డినే కాదు.. అనంతపురం జిల్లాలో ఏ రెడ్డిని అయినా నరకుతా..దమ్ముంటే కేసులు పెట్టుకోండి..' అంటూ రాప్తాడు నియోజకవర్గం జనసేన నేత సాకే పవన్ కుమార్ చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ సమర్థించుకొచ్చారు. అది కూడా కుల కోణం లోనే.

'ఒక బీసీ నేత ఆవేధన పూర్వకంగా మాట్లాడితే కేసులు పెడతారా?' అంటూ పవన్ సిసలైన కుల రొచ్చు మాటలను మాట్లాడారు. 'కావాలంటే కేసులు పెట్టుకోండి.. ' అంటూ ఆ జనసేన నేత తన నరకుడు మాటలు మాట్లాడినప్పుడే చెప్పినా, ఆయనపై కేసులు పెట్టడం గురించి పవన్ స్పందిస్తూ.. కులాన్ని ప్రస్తావించడం.. ఆయనలో పతాక స్థాయికి చేరిన కుల పైత్యాన్ని చాటుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!