రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కన్ను ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలపై పడిందనే మాట వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ వరసగా వివిధ పార్టీల ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని ఢిల్లీలో టాక్ వినిపిస్తోంది.
తాజాగా ప్రశాంత్ కిషోర్ వరసగా కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకలతో సమావేశం అయ్యారు. అంతకు ముందు ఆయన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లతో సమావేశాలను నిర్వహించారు. ఇటీవలే ఎన్సీపీ నేతలతో కూడా పీకే సమావేశం కావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా నిలిచింది.
ఈ వరస సమావేశాల పరమార్థం ఏమిటనే అంశంపై వివిధ రకాల ప్రచారాలున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీయేకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసేందుకు పీకే పూనుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే అంతకన్నా మునుపే పీకే ఒక పన్నాగాన్ని ప్రిపేర్ చేస్తున్నాడని, వచ్చే ఏడాది జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నిక విషయంలో పీకే పావులు కదుపుతున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2017లో ఆ పదవిలోకి వచ్చారు. దాదాపు నాలుగేళ్ల పదవీ కాలం పూర్తవుతోంది. వచ్చే ఏడాది ఈ సమయానికి రాష్ట్రపతి ఎన్నికల వేడి ఉండనుంది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి పీకే ఒక ప్రపోజల్ రెడీ చేశారట.
ఎన్సీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ను రాష్ట్రపతిగా చేయాలనేది ప్రశాంత్ కిషోర్ వ్యూహం అనేది లేటెస్ట్ టాక్. ఇటీవల ఎన్సీపీ అధినేత ఇంటి వేదిక పీకే పలు సమావేశాలు నిర్వహించినట్టుగా వార్తలు వచ్చాయి. వాటన్నింటి సారాంశం.. శరద్ పవార్ ను రాష్ట్రపతిగా చేయాలనేనట!
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందనేది ఇప్పటి వరకూ క్లారిటీ లేని అంశం. మరో టర్మ్ కోవింద్ కే అవకాశం ఇస్తారా? లేక మోడీ- షాలు మరొకరిని తెరపైకి తీసుకు వస్తారా? అనేది ఇంకా స్పష్టత లేదు. అయితే ప్రతిపక్ష కూటమి తరఫున మాత్రం పవార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించనున్నారట. ఇందుకు సంబంధించి ఒక్కొక్కరిని ఒప్పించడానికి పీకే రంగంలోకి దిగినట్టుగా టాక్. స్టాలిన్, నవీన్ పట్నాయక్, రాహుల్, ప్రియాంక.. వీళ్లతో పీకే సమావేశం అంతరార్థం ఇదేనని అంటున్నారు.
బలాబలాల దృష్ట్యా చూస్తే.. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఏ మూలకూ చాలదు. ఎన్సీపీ, డీఎంకేలు యూపీఏలో భాగమే అనుకున్నా… ఇంకా ఇతర పార్టీల మద్దతు చాలా కీలకం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ, టీఆర్ఎస్, బిజూజనతాదళ్ వంటి పార్టీల మద్దతు ఉంటే.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి గట్టిగా తలపడే అవకాశాలుంటాయి.
బీజేపీ కి లోక్ సభ, రాజ్యసభల్లో తిరుగులేని బలం ఉంది. అయితే రాష్ట్రాల వారీగా కూడా ఓట్లకు విలువ ఉంటుంది కాబట్టి.. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కీలకం అయ్యే అవకాశం ఉంది. మరి రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి పవార్ ఓకే చెబితే, పీకే వంటి ఘటనాఘట సమర్థుడు లాబీయింగ్ కు దిగితే.. రాష్ట్రపతి ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం ఉంది.