ఒకప్పటి పాకిస్తానీ సింగర్, కొన్నేళ్ల కిందట భారత పౌరసత్వం పొందిన అద్నాన్ సమీకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ విషయంలో కాంగ్రెస్ వాళ్లు దెప్పి పొడుస్తూ ఉన్నారు. ఒకవైపు సీఏఏ అంటూ ఉన్నారు, మరోవైపు పాక్ నుంచి వచ్చిన ముస్లింకు పద్మశ్రీ అవార్డును ఇచ్చారేంటి అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ల మాటల సంగతలా ఉంచితే, ఒక వేళ ఇదే అద్నాన్ సమీకి ఏ కాంగ్రెస్ హయాంలోనో పద్మశ్రీ ఇచ్చి ఉంటే.. కాషాయవాదులు, మోడీ భక్తులు ఎలా స్పందించి ఉండేవారు అనేది సిసలైన ప్రశ్న.
అద్నాన్ సమీ తండ్రి పక్కా పాకిస్తానీ. అంతే కాదు..ఆయన పాక్ సైన్యంలో పని చేశారు. ఇండియాతో పాక్ యుద్ధంలో పాకిస్తాన్ వాయుసేనలో ఆయన పని చేశారట. అలా భారత్ పై యుద్ధం చేసి, విధ్వంసం రేపిన ఒక పాకిస్తానీ సైనికుడి కొడుకు అద్నాన్ సమీ. ఇండియాలో సింగర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. కొన్నేళ్లకు ఇండియన్ పౌరసత్వానికి రిక్వెస్ట్ చేసుకున్నాడు. యూపీఏ టైమ్ లోనే అతడికి భారత పౌరసత్వం దక్కినట్టుగా ఉంది. ఇప్పుడు అద్నాన్ లాంటి వాళ్లకు ఇక అవకాశం ఉండదు.
పాక్ నుంచి ఎవరైనా ముస్లింలు భారత పౌరసత్వాన్ని కోరినా సీఏఏ ప్రకారం వారికి అది దక్కదని నిపుణులు చెబుతున్నారు. అయితే అదే రీతిన పౌరసత్వాన్ని పొందిన అద్నాన్ కు మాత్రం మోడీ ప్రభుత్వ హయాంలో పద్మశ్రీని ప్రకటించారు. సంగీతంతో భారతీయుల మనసును రంజింపజేసిన అద్నాన్ కు పద్మశ్రీ పెద్ద నేరం కాదు. అయితే ఇదే అవార్డునే ఏ యూపీఏ హయాంలో ఇచ్చి ఉంటే.. దాన్నొక దేశద్రోహంగా అభివర్ణించే వారు. అద్నాన్ సమీ పుట్టుపూర్వోత్తరాలన్నింటినీ తీసి.. కాంగ్రెస్ ఈ దేశానికి ఎంత ద్రోహం చేస్తోందో గమనించండని.. జనాల కళ్లు తెరిపించే వారు మోడీ భక్తులు. అయితే ఇప్పుడు అవార్డును ఇచ్చింది మోడీ ప్రభుత్వం కదా.. ఇది మాత్రం దేశభక్తే సుమా!