Advertisement

Advertisement


Home > Politics - Gossip

ప్రయారిటీ :: స్టే రాకుండా చూస్తే చాలు

ప్రయారిటీ :: స్టే రాకుండా చూస్తే చాలు

పోలవరం రీటెండర్ల వ్యవహారం హైకోర్టులో హాట్ హాట్ గా సాగుతోంది. తమతో కాంట్రాక్టును రద్దుచేసిన తీరు నిబంధనలకు వ్యతిరేకం అని పేర్కొంటూ, ముందు రీటెండర్లపై స్టే ఇవ్వాలని, న్యాయాన్యాయాలను విచారించాలనే డిమాండ్ తో నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ప్రభుత్వం-జెన్‌కో తరఫు న్యాయవాది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్టే రాకుండా చూస్తే.. చాలు ఈలోగా రీటెండర్ల వ్యవహారాన్ని ముగించేయవచ్చు అన్నట్లుగా ప్రయత్నిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు పనుల నుంచి నవయుగను తప్పించిన తర్వాత.. ఎలాంటి జాప్యం లేకుండా... నవంబరు1 నాటికి తిరిగి పనులు ప్రారంభించి త్వరత్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆల్రెడీ రీటెండర్లకు కూడా వెళ్లిపోయింది. అయితే ఆ ప్రక్రియ జరగకుండా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవయుగ వారు కోర్టుకెళ్లారు. ఇంతకాలమూ పనులు చేపట్టకపోగా.. తమకు స్థలమే అప్పగించలేదని సంస్థ కారణాలు చెబుతున్నట్లుగా కనిపిస్తోంది.

అయితే అప్పగించిన స్థలంలో కూడా పనులు చేయలేదనేది ప్రభుత్వ ఆరోపణ. ప్రభుత్వం నుంచి ఏకంగా 700 కోట్ల రూపాయల మొబిలిటీ ఎడ్వాన్సు తీసుకుని కూడా.. కనీసమాత్రంగా పనులు చేపట్టకపోవడాన్ని ప్రభుత్వం అభ్యంతరపెడుతోంది. వారి ప్రయత్నం మొత్తం.. పనులు జరగకుండా ఆపే ఆలోచన మాత్రమేనని.. అందుకే రీటెండర్లను ముందుకెళ్లేలా అనుమతించాలని ప్రభుత్వం కోరుతోంది. నవయుగ వారి దావాపై హైకోర్టులో మంగళవారం ప్రాథమికంగా వాదోపవాదాలు జరిగాయి.

పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి తమతో కాంట్రాక్టు కుదుర్చుకున్నది జెన్‌కో మాత్రమేనని.. దానితో ప్రభుత్వానికి సంబంధం లేదనేది ప్రభుత్వ వాదన. ప్రభుత్వ ఆదేశాలతో ఇవాళ కాంట్రాక్టు రద్దు చేసుకోడానికి వీల్లేదని వారు అభ్యంతరపెడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధమే లేదని వాదించడం న్యాయపీఠం ముందు ఏమాత్రం నిలబడుతుందో తెలియడం లేదు.

తమాషా ఏంటంటే.. కేవలం జలవిద్యుత్ ప్రాజెక్టు పని మాత్రమేకాదు.. పోలవరం డ్యాం నిర్మాణ పనుల లోంచి కూడా నవయుగను ప్రభుత్వం తప్పించింది. అయితే వారు ఆ సంగతి మాటాడ్డంలేదు. అక్కడ డబ్బు పుచ్చుకుని పనులు మొదలెల్టకుండా నడిపించిన నవయుగ, జలవిద్యుత్ ప్రాజెక్టు మాత్రం తమకు ఇచ్చి తీరాల్సిందేనని, ప్రభుత్వానికి ఈ విషయంలో సంబంధమే లేదని వాదించడం చిత్రంగా కనిపిస్తోంది.

అసలు కోర్టు కేసే.. రీటెండర్ల మీద అయితే.. రీటెండర్లను ముందుకెళ్లనివ్వండి.. నిదానంగా అఫిడవిట్ దాఖలు చేస్తాం అని ప్రభుత్వ ఏజీ అంటున్నారు. రీటెండర్ల వ్యవహారం అనుకున్న క్రమంలో పూర్తయిపోతే గనుక.. కేసు మరింత జటిలం అవుతుందనే సంగతిని ఎవరూ పట్టించుకోవడం లేదు.

'బాహుబలి' ఇంకా కలగానే ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?