స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో బ్యూటీ లీడర్ ఇరుక్కున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశ చరిత్రలోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అతిపెద్దదని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పిన సంగతి తెలిసిందే. రూ. 371 కోట్లను అప్పనంగా దోచుకున్నారని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఈ డబ్బులను షెల్ కంపెనీ ద్వారా మళ్లించారని ఆయన ఆరోపించారు. విదేశీ లాటరీ తరహాలో స్కామ్‌కు టీడీపీ నేతలు పాల్పడ్డారని సీఎం చెప్పారు.
2014 లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థ తో కలసి ఓ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నట్లు ప్రకటించింది. అప్పట్లో ప్రభుత్వం పెద్దలు ఏం చెప్పారంటే….దీనికయ్యే ఖర్చు మొత్తం 3వేల కోట్ల రూపాయలకు పైగా. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పేరుతో సీమెన్స్ సంస్థ ఉచితంగా ఇస్తుందని చెప్పారు. కేవలం 10% మాత్రమే ఏపీ ప్రభుత్వం అంటే 371 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుందని ప్రకటించారు.
అయితే సీమన్స్ సంస్థతో ఒప్పందం చేసుకునే సమయంలో మూడో సంస్థ ప్రవేశించింది. సీమెన్స్ సంస్థకు సబ్ కాంట్రాక్ట్ర్ గా పూణేకు చెందిన డిజైన్ టెక్ అనే సంస్థ తెరమీదకు వచ్చింది. సీమెన్స్ సంస్థ నుంచి రూపాయి కూడా రాలేదు. ఇదే సందర్భంలో ఏపీ ప్రభుత్వం తన వాటా కింద రూ.371 కోట్లు చెల్లించింది.
రూ.371 కోట్లు కొల్లగొట్టడంలో ఓ బ్యూటీ యంగ్ లీడర్ పాత్ర ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. అప్పట్లో ఈమె నారా లోకేశ్‌కు సన్నిహితంగా మెలిగారనే పేరు వుంది. టీడీపీ చెప్పిందల్లా తూచా తప్పక చేసేవారు. ఢిల్లీ వేదికగా తెలుగు తల్లి వేషం వేసి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రత్యర్థులపై రెచ్చిపోయేవారామె. ఒక చానల్ డిబేట్‌లో జనసేనాని పవన్‌కల్యాణ్‌పై పువ్వులు నలపడం కాదంటూ ఘాటు విమర్శలు చేయడం, ఆ పార్టీ నాయకుడు గట్టి కౌంటర్ ఇవ్వడంతో స్టూడియో నుంచి వెళ్లిపోయారు.
సదరు నాయకురాలు గుంటూరు, విజయవాడలతో పాటు మరో చోట తన సంస్థ ద్వారా యూత్‌కు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. తద్వారా భారీ మొత్తంలో వెనకేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. సదరు శిక్షణకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి రూ.7 కోట్లు- రూ.8 కోట్ల వరకు రావాల్సి ఉన్నట్టు తెలిసింది.
ఏది ఏమైనా ప్రభుత్వ విచారణలో స్కామ్ సూత్రధారులు, పాత్రధారులు బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ మహిళా యువనాయకురాలు కేంద్రంలో బీజేపీని అడ్డు పెట్టుకుని స్కామ్ నుంచి బయటపడే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమనే వాదన కూడా వినిపిస్తోంది.