రామోజీరావు అంటే.. తెలుగు మీడియా మొగల్ గా గుర్తింపు ఉంది. ఆరోజుల్లో సాంప్రదాయ పద్ధతుల్లో సాగుతున్న దినపత్రికల పోకడను ఒక్కసారిగా రూపురేఖలు మార్చేసి ఒక విప్లవాత్మకమైన రీతిలో ఆయన ఈనాడును ప్రారంభించారు. ఈనాడు ఒక సంచలనంగా మారింది. జర్నలిజంలో అనేక కొత్త పోకడలకు కూడా శ్రీకారం చుట్టింది. అప్పటిదాకా ఉన్న పద్ధతులను తోసిరాజని, ఈనాడు తెరపైకి తెచ్చిన అలాంటి కొత్తపోకడల్లో సంపాదకీయాలు రాయకపోయినా.. పత్రిక యజమానే సంపాదకుడిగా ఉండడం కూడా ఒకటి.
ఈనాడు అంటే రామోజీరావుకు పర్యాయపదంగా మారింది. ఆయన తొలినుంచి ఆ పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాంటి సంపాదకత్వ బాధ్యతలనుంచి రామోజీరావు తప్పుకుంటున్నారు. పత్రిక యజమానులు, సంపాదకులు ఎవరో తెలియజేసేలా.. ఏ పత్రికకైనా చిట్టచివరి పేజీలో అడుగున ‘ఇంప్రింట్’ ఉంటుంది. ఆ పత్రికకు సంబంధించి వ్యక్తుల అధికారిక హోదాలు అక్కడ ఉంటాయి. అక్కడ రామోజీరావు పేరు ఎడిటర్ హోదాలో మనకు కనిపిస్తుంది.
46 ఏళ్ల సుదీర్ఘమైన సంపాదకత్వ అనుబంధం నుంచి రామోజీరావు పక్కకు తప్పుకోనున్నారు. రేపటినుంచి అంటే.. 14 డిసెంబరు 2019 శనివారం నాటినుంచి ఈనాడు ‘ఇంప్రింట్’లో ఆయన పేరు కేవలం ‘ఫౌండర్’గా మాత్రమే కనిపించనుంది. ఇన్నాళ్లూ ఎడిటర్ హోదాలో ఎవరూ లేని ఈనాడు సామ్రాజ్యంలోకి కొత్తగా ‘సంపాదకులు’ రానున్నారు.
ఈనాడు దినపత్రిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిషన్లకు వేర్వేరుగా ఎడిటర్లను నియమిస్తోంది. సంస్థలో ఇప్పటికే చాలా సీనియర్లుగా సేవలందిస్తున్న డి.ఎన్.ప్రసాద్ తెలంగాణ ఎడిషన్‌కు, మానికొండ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌కు సంపాదకులుగా వ్యవహరిస్తారని… ఇంప్రింట్ లో కూడా ఎడిటర్ గా వారి పేర్లే ఉంటాయని తెలుస్తోంది. ఇంత సుదీర్ఘకాలం పత్రిక నడిపిన తర్వాత… రామోజీరావు.. పత్రిక సంపాదకత్వ బాధ్యతలనుంచి తప్పుకుంటుండడం విశేషమే.