తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరిపోయిన మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి ఇంకా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి మీద 'ప్రేమ' తగ్గినట్లు కన్పించడంలేదు. సీబీఐ, ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడానికే సుజనా చౌదరి, బీజేపీలోకి వెళ్ళారనీ.. ఇదంతా చంద్రబాబు స్క్రీన్‌ప్లే ప్రక్రారమే జరిగిందనీ.. ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే వుంది.
మొన్నటికి మొన్న అమరావతి విషయంలో సుజనా చౌదరి చేసిన యాగీ అంతాఇంతా కాదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద పడ్డారు సుజనా చౌదరి. మామూలుగా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తననెవరూ పట్టించుకోవడంలేదని అనుకుంటున్నారో ఏమోగానీ, ఈసారి తన విమర్శలకు కొంత 'పెప్' యాడ్ చేస్తున్నారు. ఆ 'పెప్' ఏంటో తెలుసా.? చంద్రబాబు పాలన మీద విమర్శలు చేయడం.
'చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేశారు.. సోమవారం – పోలవారం.. అన్నారే తప్ప, పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగనివ్వలేదు. చంద్రబాబుతో పోల్చితే, ఇప్పుడు వైఎస్ జగన్ పాలన కూడా గొప్పగా ఏమీలేదు. పైగా, పోలవరం ప్రాజెక్టుకి జగన్ పాలన శాపంగా మారుతోంది. రివర్స్ టెండరింగ్ అనేది దుర్మార్గమైన చర్య..' అంటూ సుజనా చౌదరి, వైసీపీని విమర్శిస్తూ.. అందులోకి చంద్రబాబునీ లాగుతున్నారు.
నిజమే, చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. పైగా, సోమవారం – పోలవారం.. అంటూ చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు చేసిన మాట కూడా వాస్తవం. కానీ, ఆ పబ్లిసిటీ స్టంట్స్‌లో సుజనా చౌదరి 'పాత్ర' తక్కువేమీకాదు. టీడీపీ అధికారంలో వున్నన్నాళ్ళూ చంద్రబాబుకి 'బాకా' ఊదిన సుజనా చౌదరి, ఇప్పుడు షడెన్‌గా ప్లేటు ఫిరాయించేసినంత మాత్రన.. చంద్రబాబుతో వున్న సుజనా బంధం తెగిపోతుందా.? ఛాన్సేలేదు. ఇద్దరిదీ విడదీయరాని బంధం.
వైఎస్ జగన్‌ని విమర్శించడం ద్వారా బీజేపీ పెద్దల దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాలన్నది సుజనా చౌదరి 'అత్యుత్సాహం'. బీజేపీ పెద్దలేకాదు, సుజనా చౌదరి తీరుకి చంద్రబాబు కూడా లోలోపల ఉబ్బితబ్బిబ్బవుతూ వచ్చారు ఇప్పటిదాకా. కానీ, ఇప్పుడు సుజనా రూటు మార్చారు.. మరి, టీడీపీ నేతలు సుజనా చౌదరికి కౌంటర్ ఇస్తారా.? వేచి చూడాల్సిందే.