Advertisement

Advertisement


Home > Politics - Gossip

తెగేదాకా వచ్చింది.. కేసీఆర్ తలవంచక తప్పదా?

తెగేదాకా వచ్చింది.. కేసీఆర్ తలవంచక తప్పదా?

తెలంగాణ ఆర్టీసీ ఉద్యమం చేయిదాటిపోతోంది. చర్చల దశ విఫలం కావడం, కార్మికులు సమ్మెకు పోవడం, కేసీఆర్ పట్టుదలతో ఉండటం.. అన్నీ అయిపోయాయి. శనివారం ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నంతో ఉద్యమం మరో స్టేజ్ కి వెళ్లింది. ఖమ్మం డిపో డ్రైవర్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో కార్మికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఖమ్మం జిల్లా ఆందోళనలతో అట్టుడికింది. ఆర్టీసీ బస్సుల్ని ఆర్టీసీ కార్మికులే ధ్వంసం చేస్తున్న సంఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టాయి.

ఇక కేసీఆర్ వచ్చి బతిమలాడినా కుదిరే పనికాదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయితేనే ఈ ఉద్యమం చల్లారేలా కనిపిస్తోంది. తెగేదాకా లాక్కోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతం సగటున 50వేలు ఉందని కేసీఆర్ కామెంట్ చేయడం, బ్లాక్ మెయిల్ చేస్తే బెదిరిపోనంటూ మరింతగా రెచ్చగొట్టడం, సెల్ఫ్ డిస్మిస్ అనే పదంతో కించపరచడం, పోలీసుల్ని పెట్టించి ఆందోళనల్ని అడ్డుకోవాలని చూడటం.. ఇవన్నీ కార్మికులను తీవ్ర మనస్థాపానికి గురిచేశాయి. ఇందుకేనా ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంది అంటూ చాలామంది ఆవేశంతో ఊగిపోతున్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో సమ్మెకు మద్దతు తెలిపి, ఆర్టీసీ కార్మికుల్ని పొగిడిన నోళ్లే.. ఇప్పుడు వారిని అత్యాశపరులుగా విమర్శించడం మరీ దారుణం. కేసీఆర్ కి భయపడి ఒక మంత్రికానీ, ఒక ఎమ్మెల్యే కానీ పరామర్శకు రాకపోవడం కార్మికుల్ని మరింత బాధకు గురిచేస్తోంది. తమ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చి అధికారం దక్కించుకున్నవాళ్లు, ఇప్పుడు తమను పూచిక పుల్లతో సమానంగా తీసివేశారని బాధపడుతున్నారు కార్మికులు, కుటుంబ సభ్యులు.

ఇప్పటివరకూ జరిగిన ఉద్యమం డ్రైవర్ ఆత్మహత్యాయత్నంతో మరో టర్న్ తీసుకుంది. ఇంకొందరు కార్మికులు కూడా అదే రీతిన ఆత్మహత్యకు ప్రయత్నించినా తోటివారు అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చిన అఖిలపక్షం కూడా ఈ ఘటనతో ఆందోళనల్ని మరింత ఉధృతం చేయాలని చూస్తోంది. మరోవైపు దసరా సెలవల్ని వారంపాటు పొడిగించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా బస్సుల్ని రోడ్లపైకి తెచ్చేందుకు అధికారులతో మల్లగుల్లాలు పడుతున్నారు.

ఇప్పటి వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ ఉద్యమం ఒక్కరోజులో బద్దలైంది. ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం కూడా బలిదానాల తర్వాతే ఉపందుకుంది. జనంలో మరింత ఐక్యత పెంచింది. సకల జనుల సమ్మె మొదలైంది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాయత్నాలు కూడా అందరిలో పట్టుదలను మరింత పెంచాయి. ఇటు టీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ వైఖరితో కలత చెందుతున్నారు. అటు అధినేతకు చెప్పే దమ్ము లేక, ఇటు కార్మికుల్ని ఫేస్ చేసే దైర్యంలేక సతమతమవుతున్నారు. మొత్తమ్మీద తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఇప్పుడు తెగేదాకా వచ్చింది.

తెరమీద నీతులు.. తెర వెనుక బ్లాక్ మెయిలింగ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?