Advertisement

Advertisement


Home > Politics - Gossip

స‌త్య‌వేడు బ‌రిలో యువ నాయ‌కుడు!

స‌త్య‌వేడు బ‌రిలో యువ నాయ‌కుడు!

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు సీటు కోసం వైసీపీలోని ఇద్ద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ట్టుద‌ల‌తో పోరాడుతున్నారు. స‌త్య‌వేడు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క వ‌ర్గం. ఇక్క‌డి నుంచి వైసీపీ త‌ర‌పున ఆదిమూలం ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. స‌ర్వేల్లో ఆయ‌నకు పాజిటివ్‌గా రాలేద‌ని, అందువ‌ల్ల అభ్య‌ర్థిని మార్చాల‌ని సీఎం జ‌గ‌న్ అనుకుంటున్నారు.

అయితే స‌త్య‌వేడుకు అభ్య‌ర్థి ఎవ‌రైతే బాగుంటుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇప్ప‌టికే వైసీపీ త‌ర‌పున ర‌క‌ర‌కాల పేర్లు వినిపించాయి. గూడూరు ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్ కుమారుడికి టికెట్ ఇచ్చే అవ‌కాశాలున్నాయ‌ని కొంద‌రు అన్నారు. అలాగే సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి క‌రికాల‌వ‌న్‌ను నిల‌బెడుతార‌ని కొంత కాలం ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా వైసీపీ యువ‌జ‌న విభాగం తిరుప‌తి జిల్లా అధ్య‌క్షుడు ఆరె అజ‌య్‌కుమార్ తెర‌పైకి వ‌చ్చింది.

అజ‌య్‌కి తిరుప‌తి జిల్లాలో సీనియ‌ర్ ఎమ్మెల్యే, సీఎం జ‌గ‌న్ అబ్బ వైఎస్ రాజారెడ్డితో మొద‌లుకుని మూడు త‌రాల‌తో స‌త్సంబంధాలున్న నాయ‌కుడు గ‌ట్టిగా మ‌ద్ద‌తు తెలిపిన‌ట్టు స‌మాచారం. స‌త్య‌వేడు అభ్య‌ర్థిగా అజ‌య్ అయితే గెలుపు అవ‌కాశాలు ఏ విధంగా ఉన్నాయో స‌ద‌రు సీనియ‌ర్ నాయ‌కుడు సీఎం జ‌గ‌న్‌తో పాటు వైసీపీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం.

స‌త్య‌వేడులో 35 వేల యాదవుల ఓట్లు ఉన్నాయి. ద‌ళితుల్లోనూ వైసీపీకి మంచి ఆద‌ర‌ణ వుంది. ఇక రెడ్ల ఓట్ల‌లో మెజార్టీ ఆ పార్టీకే ద‌క్కుతాయి. అజ‌య్ భార్య ఉమా యాద‌వ్ బీసీ సామాజిక వ‌ర్గ నాయ‌కురాలు. ఈమె తిరుప‌తి రెండో డివిజ‌న్ కార్పొరేట‌ర్‌గా, స్టాండింగ్ కౌన్సిల్ మెంబ‌ర్‌గా ఉన్నారు. అజ‌య్ అభ్య‌ర్థి అయితే సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌లో క‌లిసొస్తుంద‌ని వైసీపీ అధిష్టానానికి స‌ద‌రు నేత వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రీ ముఖ్యంగా అజ‌య్ వైసీపీకి అత్యంత విధేయుడు. గ‌తంలో తెలంగాణ‌లోని మ‌హ‌బూబాబాద్‌లో జ‌గ‌న్‌పై రాళ్ల దాడి జ‌రిగింది. దీనికి నిర‌స‌న‌గా తిరుప‌తిలో ప‌లు ప్ర‌భుత్వ ఆస్తుల విధ్వంసం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌ల‌న్నింటిలోనూ అజ‌య్ మొద‌టి నిందితుడు. ఈ కేసుల్లో అజ‌య్ నెల్లూరు జైల్లో 45 రోజులు గ‌డిపారు.

సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై విష‌య ప‌రిజ్ఞానం, సీఎం జ‌గ‌న్‌పై అభిమానం ఉన్న అజ‌య్‌కి టికెట్ ఇస్తే బాగుంటుంద‌ని సీనియ‌ర్ ఎమ్మెల్యే అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. మ‌రోవైపు చిత్తూరు జిల్లాకు చెందిన మ‌రో సీనియ‌ర్ మంత్రి త‌న అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో ఇద్ద‌రు నేత‌లు చెరో అభ్య‌ర్థిని బ‌ల‌ప‌రుస్తుండ‌డం వైసీపీ అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారిన‌ట్టు స‌మాచారం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?