ఈసారి అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయ వారసులు గట్టిగా పోటీచేశారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుని కొందరు, అదనంగా మరికొందరు తమ వారసులను పోటీచేయించారు. తమ ఇంట్లోని నూతన తరానికి అవకాశం ఇవ్వడానికి కొందరు నేతలు రిటైర్మెంట్ తీసుకున్నారు. మరి అలాంటి వారు తెరమీదకు వచ్చిన ఈ ఎన్నికల్లో, వారెవరికీ విజయం తేలికగా కనిపించకపోవడం విశేషం. తమ తమ కుటుంబాల నేపథ్యాలను బట్టి అయినా వారు తేలికగా నెగ్గే అవకాశాలు కనిపించడంలేదు. ఎందుకంటే రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయి మరి!
ఎస్పీవై రెడ్డి ముగ్గురు వారసులు!
బహుశా ఈసారి ఏకంగా ముగ్గురు వారసులు బరిలోకిదించిన ఏకైక కుటుంబం ఎస్సీవై రెడ్డిదేనేమో. ఎన్నికల పోలింగ్ దశలో అస్వస్థతకు గురయిన ఎస్పీవై రెడ్డి గతవారంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన వారసులు ముగ్గురు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఒక అల్లుడు, ఇద్దరు కూతుళ్లు. వీరు ముగ్గురూ జనసేన తరఫున పోటీచేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు వీరు నామినేషన్లు వేశారు. వీరు కొద్ది మేరకు ఓట్లను చీల్చినా విజయం మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే!
జేసీ వారసులు ఇద్దరు!
అనంతపురం ఎంపీగా జేసీ పవన్, తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్‌రెడ్డి పోటీచేశారు. దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్ రాజకీయాన్ని నడిపించారు. మరి ఈ నయా జేసీ బ్రదర్స్ రాజకీయ గమనం ఎలా ఉంటుందనేది ఆసక్తిదాయకం. అయితే వీరు టఫ్ ఫైట్‌ను ఎదుర్కొంటూ ఉన్నారు. వీరి ఆరంగేట్రం గ్రాండ్‌గా ఉండేలాలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి వీరు గట్టిపోటీని ఎదుర్కొంటూ ఉన్నారు. వీరు ఓడిపోవడం ఖాయం.. అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయంటే పరిస్థితి ఎంత టైట్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పరిటాల వారసుడి గెలుపుపై నమ్మకం లేదా?
తన తల్లిని పోటీ నుంచి తప్పుకొమ్మని ఒత్తిడి తెచ్చి మరీ పరిటాల శ్రీరామ్ ఈసారి ఎన్నికల్లో పోటీచేశారనే ప్రచారం ఉంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో మరోసారి పోటీచేయాలని పరిటాల సునీత అనుకున్నారని, అయితే శ్రీరామ్ తను బరిలోకి దిగాలనే ఉత్సాహంతో తన తల్లిని పోటీచేయవద్దని చెప్పారని, తనయుడి కోసం ఆమె త్యాగం చేశారని అంటారు. ఇదే సమయంలో పరిటాల శ్రీరామ్‌కు అక్కడ అనుకూల పరిస్థితి అయితే కనిపించడం లేదు! ఈసారి పరిటాల కుటుంబం ప్రత్యర్థులు పైచేయి సాధించడం ఖాయమని.. రాప్తాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాపాతుతూ.. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విజయం సాధించడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉండటం గమనార్హం.
కేఈ శ్యామ్‌కు ఓటమి తప్పదా?
ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేఈ కృష్ణమూర్తి తనయుడు కూడా ఈ ఎన్నికల్లో పోటీచేశారు. పత్తికొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కేఈశ్యామ్ పోటీచేశారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే కేఈ శ్యామ్ విజయం కష్టసాధ్యమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పోలింగ్ అనంతర విశ్లేషణల్లో అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించవచ్చుననే అంచనాలున్నాయి.
శిల్పా తనయుడికి గట్టిపోటీ!
నంద్యాల నుంచి అసెంబ్లీకి పోటీచేసిన శిల్పామోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్రారెడ్డికి కూడా ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఉంది. నంద్యాల ఉప ఎన్నికలతో పొలిటికల్ ఆరంగేట్రం చేసిన భూమా బ్రహ్మానందరెడ్డికి, శిల్పా రవిచంద్రారెడ్డికి మధ్యన గట్టిపోటీ నెలకొంది. ఎవరు నెగ్గుతారనేది చెప్పడం కష్టంగా మారిందని స్థానికులే అంటున్నారు. తక్కువ కాలంలోనే బ్రహ్మానందరెడ్డి నంద్యాల ప్రజలను ఆకట్టుకున్నాడనే అభిప్రాయాలున్నాయి. అయితే ఎస్పీవీ రెడ్డి అల్లుడు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీలో ఉండటంతో.. ఓట్ల చీలిక తప్పడంలేదు. ఆయన ఎవరి ఓట్లను చీల్చి ఉంటారనేది చెప్పడం కూడా కష్టమే. నంద్యాల్లో ఎవరు గెలిచినా కేవలం సమీకరణాల మీద నెగ్గాల్సిందే!