బాబుకు నమ్మకం కలిగించని నివేదికలు

నియోజకవర్గాల వారీ సమీక్షలు షురూ చేసారు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు. తొలిరోజు రాజమండ్రి ఎంపీ పరిథిలోని ఏడు నియోజకవర్గాల పరిస్థితిని సమీక్షించారు. తెలుగుదేశం అద్భుతంగా గెలవబోతోందని, అందులో సందేహం లేదని, కేవలం ఓట్ల ఎలా…

నియోజకవర్గాల వారీ సమీక్షలు షురూ చేసారు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు. తొలిరోజు రాజమండ్రి ఎంపీ పరిథిలోని ఏడు నియోజకవర్గాల పరిస్థితిని సమీక్షించారు. తెలుగుదేశం అద్భుతంగా గెలవబోతోందని, అందులో సందేహం లేదని, కేవలం ఓట్ల ఎలా వస్తాయో తెలుసుకోవడానికే ఈ సర్వే అని ఓ క్లారిఫికేషన్ ఇచ్చారు. అన్నీ బాగానే వున్నపుడు, ఇప్పుడు అర్జెంట్ గా ఈ సమీక్షలు ఎందుకు?

సరే, ఆ సంగతి అలా వుంచితే నియోజకవర్గాల వారీగా అధిష్టానం కోరినట్లు నివేదికలు తయారు చేసుకుని వచ్చారు. కానీ అక్కడే బాబు బయటపడ్డారు. ఈ నివేదికలు తప్పు అయితే గదిలో కట్టేసి నాలుగు రోజులు వుంచేస్తా అని చెప్పేసారు. అదేంటీ? నివేదికల్లో మెజార్టీతో గెలుస్తాం అని వుంది. బాబుగారు కూడా పదే పదే గెలుస్తాం అనే చెబుతున్నారు.

మరి మధ్యలో ఈ అపనమ్మకం ఎందుకు? బాబు గెలుస్తాం అంటే నాయకులు ఎవరూ ఎదురు ప్రశ్నించలేదు కదా? మీరు చెప్పేది అబద్దం అయితే గదిలో కట్టేస్తాం అని అనలేదు కదా? మరి నాయకులు చెప్పిన నివేదికలను ఎందుకు నమ్మడం లేదు? వారు గెలుస్తామనే చెప్పారు. మెజార్టీలు కాస్త అటు ఇటు వుండొచ్చు. కానీ బాబు మాత్రం తేడా వస్తే అని అంటున్నారు. అంటే బాబుకు ఇంకా గెలుపు మీద పూర్తి భరోసా, నమ్మకంలేదు అనుకోవాలా?

ఇదిలావుంటే మరోపక్కన కొవ్వూరు నియోజకవర్గంలో అభ్యర్థి అనితకు చాలామంది సహకరించలేదని, అన్నీ తెలుసుకుంటున్నా అని బాబు చెప్పారు. రాజమండ్రిలో మేయర్, ఆమె భర్త, బొడ్డు భాస్కరరామారావు అస్సలు సహకరించలేదని, పైగా ప్రతిపక్ష వైకాపాకు సహకరించారని నాయకులు సమీక్షా సమావేశంలో చెప్పారు. ఇంకోపక్క జనసేన ప్రభావం తక్కువ అంచనా వేసామని దేశం అభ్యర్థినే స్వయంగా చెప్పారు.

ఇవన్నీ లెక్కలు వేసుకుంటే, మళ్లీ బాబుగారి నమ్మకం నిజంగా నమ్మకమేనా? అన్న అనుమానం కలుగుతోంది. మొత్తం మీద చూసుకుంటే ఇదంతా ఓ కాలక్షేపం వ్యవహారం మాదిరిగా కనిపిస్తోంది.

పరిటాల వారసుడి గెలుపుపై నమ్మకం లేదా?