Advertisement

Advertisement


Home > Politics - Gossip

సెల్ఫ్‌ డిస్మిస్‌.. కేసీఆర్‌కి 'షాక్‌' తప్పదా.?

సెల్ఫ్‌ డిస్మిస్‌.. కేసీఆర్‌కి 'షాక్‌' తప్పదా.?

48 వేలమంది ఆర్టీసీ కార్మికులు.. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయిప్పుడు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని రక్షించండి మహాప్రభో.. అని ప్రభుత్వానికి కార్మిక సంఘాలు మొరపెట్టుకుంటే, 'యూఆర్‌ సెల్ఫ్‌ డిస్మిస్డ్‌..' అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించేశారు. చేసిన పనికి జీతాలు ఇవ్వకుండా 'సెల్ఫ్‌ డిస్మిస్‌' అని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

ఆర్టీసీ సంస్థ వేరు - ప్రభుత్వం వేరు.. అనే స్థాయికి పరిస్థితిని తీసుకొచ్చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఉద్యోగ సంఘాల్ని పిలిపించుకుని, వారిని బుజ్జగించి.. ఆర్టీసీ కార్మికుల వైపు వెళ్ళనీయకుండా చేయడంలో ఘనవిజయం సాధించేశానని కేసీఆర్‌ అనుకోవచ్చుగాక.! కానీ, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఏ స్థాయిలో సత్తా చాటారో కేసీఆర్‌కి తెలియదని అనుకోలేం.

పైకి కనిపిస్తున్నది 48 వేలమంది కార్మికులే కావొచ్చు.. కొత్తగా ఆ 48 వేల ఉద్యోగాలు ఇంకొకరికి ఇచ్చేస్తే.. ఉద్యోగాల కల్పన పేరుతో మంచి మార్కులు కొట్టేయొచ్చని ఆశించొచ్చు.. కానీ, కేసీఆర్‌ పప్పులుడికే పరిస్థితి అయితే లేదన్నది నిర్వివాదాంశం. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

తెలంగాణ ఉద్యమంలో ఈ బలవన్మరణాలే కీలకపాత్ర పోషించాయి. వాటిని ఏ స్థాయిలో కేసీఆర్‌ అండ్‌ టీమ్‌ రాజకీయంగా వాడుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడు ఉద్యమం పేరుతో రాజకీయం చేసి.. ఇప్పుడేమో, విపక్షాలు ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో రాజకీయం చేస్తోందని కేసీఆర్‌ అండ్‌ టీమ్‌ ఆరోపిస్తోంది.

ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా గళం విప్పేందుకు రెవెన్యూ ఉద్యోగులు సమాయత్తమవుతున్నారు. మరోపక్క, ఇతర ఉద్యోగ సంఘాలపైనా ఒత్తిడి పెరుగుతోంది. 'నిన్న ఆర్టీసీ.. రేపు మీరు.. మీదాకా వస్తేనేగానీ మీకు కేసీఆర్‌ నిజస్వరూపమేంటో అర్థంకాదులే..' అని కార్మిక సంఘాల నుంచి పోటెత్తుతున్న ప్రశ్నలతో ఉద్యోగ సంఘాలూ పునరాలోచనలో పడ్డాయి.

ఒక్కటి మాత్రం నిజం.. ఆర్టీసీ కార్మికుల సమ్మెని పరిష్కరించడం కేసీఆర్‌కి చిటికెలో పని. కానీ, ఆయన ఆ సమస్యని పరిష్కరించ దలచుకుంటున్నట్లు కన్పించడంలేదు. అంటే, సెల్ఫ్‌ డిస్మిస్‌.. అనే విధానాన్ని కేసీఆర్‌ తనకు తానుగా ప్రయోగించుకుంటున్నారన్నమాట.  

జ్ఞానం రాత్రికి రాత్రి రాదు.. విద్యార్జన నిరంతర ప్రక్రియ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?