ఫ్యాను గాలి వైపుగా ‘సేనా’ ప్రవాహం!

వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదంటే… ఓటమి కారణాలను ఈవీఎంలు, ఈసీమీద నెట్టేయడానికి చంద్రబాబు- బాబు నిర్ణయాల మీద నెట్టేయడానికి పార్టీలోని ఇతర నాయకులు పరస్పరం తంటాలు…

వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదంటే… ఓటమి కారణాలను ఈవీఎంలు, ఈసీమీద నెట్టేయడానికి చంద్రబాబు- బాబు నిర్ణయాల మీద నెట్టేయడానికి పార్టీలోని ఇతర నాయకులు పరస్పరం తంటాలు పడుతున్నారు. జనసేన నాయకుడు నాలుగురోజులు ఫ్లాష్ లైట్ లాగా బెజవాడలో మెరిసి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తెదేపా, జనసేన పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు వైకాపా వైపు రావాలని అనుకుంటున్నారని, జగన్ మాత్రం నో అంటున్నాడని కూడా పుకార్లు వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే… ఆ పార్టీల్లో కిందిస్థాయిలో, కార్యకర్తల్లో ఏం జరుగుతోంది?

తెదేపా కార్యకర్తల్లో ఇంకా కాస్త మీమాంస నడుస్తున్నది. ఏమో పార్టీ మళ్లీ ఏనాటికైనా పట్టాలమీదికి వస్తుందేమో అనే ఆశ ఆ పార్టీలో కొందరిలో మిగిలుంది. జనసేన పరిస్థితి మరీ అంత ఆశాజనకంగా లేదు. ఈ ఎన్నికల్లోనే తాను ముఖ్యమంత్రిని అయిపోతున్నానని పవన్ కల్యాణ్ ఊరూరా తిరిగి చెప్పుకున్నప్పటికీ.. ఒక్కటంటే ఒక్కటే సీటు దక్కడం రాష్ట్రవ్యాప్తంగా అందరినీ నీరుగార్చేసింది.

పైగా ఫలితాలు వెలువడిన నాటినుంచి.. ఏవో ఒకటిరెండు ఫోటో కార్యక్రమాలు తప్ప… ఇప్పటిదాకా పవన్ కల్యాణ్ ప్రజలకు కనీసం పత్రికల్లో కూడా కనిపించలేదు. ఇలాంటి నిర్వహణతో పార్టీ అధికారం దాకా అడుగులు వేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏమో అనే భయం పార్టీ వారిలో వచ్చేసింది. రాజకీయాలు, అధికారమూ లాటి పదాలతో సంబంధం లేకుండా.. అచ్చంగా ఎడాపెడా పవన్ కల్యాణ్ ను ప్రేమించి సినీ అభిమానులు మాత్రం ఎప్పటికీ జనసేనకే ఓటు చేస్తుండవచ్చు గాక!

కానీ రాజకీయం అంటేనే ఏదో ఒక స్థాయిలో అధికారంతో కూడా ముడిపడి ఉంటుంది. తమ పార్టీకి సుదూర భవిష్యత్తులోనైనా అలాంటి సంకేతం కూడా కనిపించకపోతుండేసరికి… కిందిస్థాయి కార్యకర్తలు అంతా గెలిచిన వైకాపా నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.

సాధారణంగా ఒకస్థాయి ఉన్న నాయకులు పార్టీ మారినప్పుడు మాత్రమే.. అది ప్రపంచానికి తెలుస్తుంది. కానీ పెద్దగా ప్రచారమేమీ లేకుండానే… జనసేన పార్టీకి జవసత్వాలుగా ఉండగల కిందిస్థాయి కార్యకర్తలు మొత్తం అధికార పార్టీలోకి వలసపోతున్న వాతావరణం రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో నెలకొంది.

బాబు అప్పుడే ఇలా ఆలోచించి ఉంటే ఫలితముండేదేమో!