ఏడోసారి కూడా టీమిండియాకు తిరుగులేకుండా పోయింది. క్రికెట్ ప్రపంచకప్ లో పాక్ జట్టుపై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. ఐసీసీ ఈవెంట్లో విజయాల పరంపరను భారత టీమ్ కొనసాగిస్తూ ఉంది. ఈసారి అయినా చరిత్రను తిరగరాయాలని పాక్ జట్టు గట్టిగానే అనుకున్నా, అది సాధ్యంకాలేదు. ప్రపంచకప్ లో పాక్ పై మరో విజయంతో ఆ సంఖ్యను 7-0 కు తీసుకెళ్లింది కొహ్లీ సేన.
అజరుద్ధీన్ హయాంలో మొదలైన ఈ విజయపరంపర కొహ్లీ సేన సాధించిన విజయంతో కొనసాగుతూ ఉంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో సాగిన మ్యాచ్ లో టీమిండియా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించింది భారత జట్టు. రోహిత్ శర్మ ధాటైన బ్యాటింగ్ తో సెంచరీని చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. రెగ్యులర్ ఓపెనర్ ధావన్ ధూరం అయినా కేఎల్ రాహుల్ ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చాడు. కొహ్లీ కూడా ఒక చెయ్యి వేయడంతో భారత జట్టు 336 పరుగుల స్కోరు సాధించింది. ఒక దశలో టీమిండియా స్కోరు ఇంకా భారీగా ఉంటుందని అనిపించినా, మిడిలార్డర్ అంతగా రాణించకపోవడంతో స్కోర్ తగ్గింది.
బౌలింగ్ లో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ కేవలం రెండున్నర ఓవర్ మాత్రమే బౌల్ చేసి గాయంతో మళ్లీ మైదానంలోకి దిగలేదు. అయినప్పటికీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాయాజాలం, పాండ్యా వరసగా రెండు బంతుల్లో వికెట్లను తీసి పాక్ ను దెబ్బతీశారు. రెండో వికెట్ కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడమే ఈ మ్యాచ్ లో పాక్ ఆశలను రేపిన అంశం. ఆ తర్వాత మాత్రం భారత జట్టుకు పాక్ పోటీ ఇవ్వలేకపోయింది.
పలుసార్లు మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. ఆఖర్లో వర్షం తగులుకునే సరికే భారత విజయం ఖరారు అయ్యింది. చివరికి పాక్ ఇన్నింగ్స్ ను నలభై ఓవర్లకు కుదించి, డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే అది అప్పటికే అసాధ్యమైన లక్ష్యంగా తేలింది. మొత్తానికి ఏడోసారి ప్రపంచకప్ మ్యాచ్ లో టీమిండియా పాక్ పై ఘన విజయాన్ని నమోదు చేసింది.