కేసీఆర్‌పై ఆయన అసంతృప్తి తీరేదెలా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి ఆ పదవిని చేపట్టిన తర్వాత.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. గత మంత్రివర్గంలో ఉన్న అనేక మందికి ఈసారి నో చెప్పారు. వారందరికీ అంతో ఇంతో అసంతృప్తి ఉండడంలో…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి ఆ పదవిని చేపట్టిన తర్వాత.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. గత మంత్రివర్గంలో ఉన్న అనేక మందికి ఈసారి నో చెప్పారు. వారందరికీ అంతో ఇంతో అసంతృప్తి ఉండడంలో ఆశ్చర్యంలేదు. ఆ వరుసలో ఆయన అల్లుడు హరీష్ రావు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తావిస్తున్న అసంతృప్తి అనేది.. ఆ కోవకు చెందినదికాదు. తాజాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డితో భర్తీ చేయడం వలన ఇతర ఆశావహుల్లో కలిగినది.

తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక నాయకుడు అయిన కేఆర్ సురేష్ రెడ్డి, ఎన్నికల తర్వాత పార్టీ తనను పట్టించుకోవడం లేదని అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేఆర్ సురేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ కీలక నాయకుల్లో ఒకరు. 2004 -09 మధ్యకాలంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన శాసనసభ స్పీకరుగా కూడా సేవలందించారు. స్పీకరుగా పరిణతిగల నేతగా, హుందా అయిన నిర్వహణ శైలితో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే విభజన అనంతరం రాష్ట్రంలో సమూలంగా మారిన రాజకీయ పరిణామాల్లో ఆయన మళ్లీ నెగ్గలేదు.

2018 శాసనసభ ఎన్నికలు భేరీ మోగిన తర్వాత.. సురేష్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి, తెరాస తీర్థం పుచ్చుకున్నారు. నిజానికి అప్పటికి టికెట్ల కేటాయింపు పర్వం మొత్తం పూర్తయిపోయి ఉంది. అయినా సరే.. టికెట్ ఆశించి వస్తున్నట్లుగా కాకుండా, ఆయన కేసీఆర్ వెంట నిలిచారు. నిజామాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో అనేక ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. అప్పట్లో తనవెంట బెట్టుకుని తిరిగిన రీతిని బట్టి కేసీఆర్, కేఆర్ సురేష్ రెడ్డికి మంచి ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అంతా అనుకున్నారు.

అయితే అదంతా మూన్నాళ్ల ముచ్చటే అయింది. ఎన్నికలపర్వం పూర్తయిన తర్వాత ఆయన ఊసేలేదు. ఎంపీ ఎన్నికల నాటికి నిజామాబాద్ సీటు కేసీఆర్ కూతురుదే గనుక.. కేఆర్ సురేష్ రెడ్డి కూడా ఆశ పెట్టుకోలేదు. కానీ.. ఆ తర్వాత వచ్చే అవకాశాల్లో అయినా పార్టీ గుర్తిస్తుందని ఆశ పెట్టుకున్నారు. నిజానికి సురేష్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న సందర్భంలోనే.. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆశ పెట్టినట్లు అప్పట్లో పుకార్లు వచ్చాయి.

ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఖాళీ వచ్చింది గానీ.. దానిని గత ప్రభుత్వంలోనూచాలా పదవులు అనుభవించిన గుత్తా సుఖేందర్ రెడ్డి తన్నుకుపోయారు. దీంతో.. సురేష్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి కేసీఆర్ వీటిని ఎలా చక్కబెడుతారో ఏమిటో?