పుట్టినరోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి మహేష్ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. ఫ్రేమింగ్, స్టైలింగ్ విషయాల్లో చూడ్డానికి కాస్త దూకుడు ఛాయలు కనిపించినప్పటికీ ఓవరాల్ గా లుక్ బాగుంది. కానీ కొంతమందికి మాత్రం మహేష్ అవతారం నచ్చలేదు. మరీ ముఖ్యంగా బన్నీ అభిమానులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు.
గతంలో నా పేరు సూర్య సినిమాలో మిలట్రీ ఆఫీసర్ గా నటించాడు బన్నీ. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ కూడా మిలట్రీ గెటప్ లోనే కనిపించాడు. ఈ రెండు గెటప్స్ ను కంపేర్ చేస్తూ.. మహేష్ ను ట్రోల్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. మిలట్రీ గెటప్ ను అవమానపరిచేలా మహేష్ లుక్ ఉందనేది వీళ్ల వాదన.
మిలట్రీ గెటప్ కోసం బన్నీ హెయిర్ స్టయిల్ మార్చాడు. మహేష్ మాత్రం తన రెగ్యులర్ హెయిర్ స్టయిల్ నే కొనసాగించాడు. మిలట్రీ గెటప్ కోసం బన్నీ క్లీన్ షేవ్ లోకి మారిన విషయాన్ని కూడా అతడి ఫ్యాన్స్ ప్రస్తావించారు. మహేష్ మాత్రం అదే గెటప్ లో ఉంటూ గడ్డం మెయింటైన్ చేశాడు. అటు ఫిజిక్ పరంగా కూడా మిలట్రీ మేన్ గా కనిపించేందుకు బన్నీ చాలా కష్టపడ్డాడని, మహేష్ మాత్రం అలాంటి ప్రయత్నమేమీ చేయలేదని ఎద్దేవా చేస్తున్నారు.
నిజానికి మిలట్రీ గెటప్ కోసం బన్నీ అంతలా మహేష్ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా మొత్తం మిలట్రీ గెటప్ కాదు కాబట్టి మహేష్ కు అంత అవసరం అక్కర్లేదు. ఇంతకుముందు ఈ పాత్రలు పోషించిన హీరోలు కూడా ఇలాంటి జాగ్రత్తలేం తీసుకోలేదు. కానీ ప్రత్యేకించి మహేష్ విషయంలోనే బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడానికి ఓ రీజన్ ఉంది.
మహేష్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. నిన్న రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఈ విషయాన్ని మరోసారి స్పష్టంచేశారు. అటు బన్నీ చేస్తున్న సినిమాను కూడా సంక్రాంతికే సిద్ధం చేస్తున్నారు. అంటే.. మహేష్-బన్నీ మధ్య బాక్సాఫీస్ వార్ అన్నమాట. ఆ వార్ ను బన్నీ ఫ్యాన్స్ ఇలా ముందుగానే ప్రారంభించారన్నమాట. అదీ సంగతి.