ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని రోజుల కిందట ఒక ప్రకటన చేశారు. కరోనా విపత్కర పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు.. నాయకులు దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించకుండా ఈ విపత్తునుంచి బయటపడడానికి ఆలోచించాలని అన్నారు. నిజానికి ఇది పార్టీ రహితంగా ప్రజలందరూ కూడా ఒప్పుకునే విషయం. కానీ వాస్తవంలో జరుగుతున్నది మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తెలుగుదేశానికి చెందిన పలువురు నాయకులు.. కరోనా విషయంలోనే ప్రభుతవాన్ని ఇరుకున పెట్టడానికి అర్థం పర్థంలేని కువిమర్శలతో తెరమీదకు వస్తూ… తమలోని సంకుచితత్వాన్ని చాటుకుంటున్నారు.
తాజాగా.. అడ్డగోలుగా మాట్లాడడంలో అందెవేసిన చేయి అని ప్రజలు అనుకునే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. జగన్ సర్కారు మీద విమర్శలు కురిపించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా లాక్ డౌన్ ప్రభావం… ఇంకా సమర్థంగా చేపట్టాల్సిన చర్యలు గురించి మాత్రమే మాట్లాడుకుంటుండగా.. ఆయన మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారాన్ని తెరపైకి లాగడానికి ప్రయత్నించారు.
ఈసీ, సుప్రీం కోర్టులే పుణ్యం కట్టుకుని.. ఎన్నికలు వాయిదా పడడానికి సహకరించాయని.. లేకపోతే.. ఈ సమయానికి రాష్ట్రంలో ప్రజలందరూ కోట్ల సంఖ్యలో పోలింగ్ బూత్ ల వద్ద నిల్చుని, క్రక్కిరిసి కరోనా ప్రబలడానికి ప్రధాన కారకులు అయి ఉండువారని ఆయన విమర్శించారు. ఇదేదో పనిగట్టుకుని… కరోనాకు ముడిపెట్టి జగన్ సర్కారును ఆడిపోసుకునే యావ లాగా కనిపిస్తోంది.
అదు సమయంలో రెండు రోజుల కిందట వర్ల రామయ్య కూడా ఇలాంటి సంకుచిత ప్రకటనలతోనే తెరపైకి వచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫాకు కరోనా సోకిందనే ప్రచారం జరగడంతో ఆ విందుకు వెళ్లిన వారందరినీ క్వారంటైన్ కు పంపాలని డిమాండ్ చేశారు. ఇదంతా పుకార్ల ఆధారంగా వైకాపా సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నంగానే అందరూ అనుకున్నారు.
చూడబోతే.. రాజకీయం చేయవద్దు అని తాను పైకి మంచి సందేశం ఇస్తూ… ప్రభుత్వ చర్యల గురించి తన తెలుగు తమ్ముళ్లు సంకుచిత, కుత్సిత ప్రకటనలు చేసేలాగా చంద్రబాబునాయుడు మార్గదర్శనం చేస్తున్నారా? అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.