cloudfront

Advertisement


Home > Politics - Gossip

సోది చెబుతానమ్మా.. సోది

సోది చెబుతానమ్మా.. సోది

గాలి పోగేసి కబుర్లు చెబితే సోది చెబుతున్నాడనే అంటారు. పల్లెల్లో సోది చెప్పేవాళ్లు కనిపిస్తుటారు. వీళ్లు ఉన్నవీ, లేనివీ కలిపి, చాలా పద్దతిగా కథలు అల్లి ఆకట్టుకుంటారు. ఆ విద్య అందరికీ రారు. ఆర్కేగా పాపులర్ అయినా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఈ తరహా రాత శైలి అద్భుతంగా వచ్చు. అందుకే ఆయన వారం వారం తన కొత్తపలుకులో ఇలాంటి కథనాలు వండి వారుస్తుంటారు. ఈవారం కూడా ఆయన అలాంటి కథనమే ఒకటి వండి వార్చారు.

''...జగన్మోహన్‌రెడ్డి.. బీసీలను కూడా క్రైస్తవ మతంలోకి మళ్లించడానికి పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఏపీలో క్రైస్తవ మతం ఎంత వ్యాప్తి చెందితే జగన్మోహన్‌రెడ్డికి రాజకీయంగా అంత లాభం. జగన్మోహన్‌రెడ్డి అనుసరించబోయే ఈ వ్యూహాన్ని బీజేపీ ఎలా ఎదుర్కోబోతున్నదో వేచిచూడాలి..''

ఇది ఆర్కే కొత్త పలుకులో ఓ పలుకు.. చెబుతున్నారుట.. ఎవరు చెబుతున్నారో? అన్నది లేదు. నింద తనమీదకు రాకుండా వుండడానికి ఆర్కే వాడిన పద మాయాజాలం ఇది తప్ప వేరు కాదు. బీసీలు అంటే ఒక కులం కాదు. అనేకానేక కులాల సముదాయం. వీరి ఆచారాలు, వ్యవహారాలు, పద్దతులు, ఆలోచనా విధానాలు వేరు వేరు. ఇలాంటి వీరిని గంపగుత్తగా ఒకే విధంగా క్రైస్తవ మతంలోకి మళ్లించడం అన్నది సులువైన పని కాదు. సాధ్యమైన పని కూడా కాదు. పైగా పేరుకు బిసిలే కానీ, బిసిల్లో చాలా కులాలు ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఎక్కువగా దారిద్ర రేఖకు దిగువనో, కాస్త ఎగువనో వున్నవారు కాదు.

బిసిల్లో చాలా కులాలు ఆర్థికంగా బలంగా వున్నవి కూడా వున్నాయి. శ్రీకాకుళంలో కాళింగులు, విశాఖ జిల్లాలో గవరలు బిసిలే. కానీ వారి ఆర్థిక సామర్థ్యం ఎలాంటిదో ఆయా జిల్లాల్లో అడిగితే తెలుస్తుంది. కాళింగులు విద్య, వ్యవసాయ పరంగా బాగా పైకి వచ్చారు. అలాగే గవరలు ఆర్థికంగా చాలా బలంగా వుంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇంకా చాలా బిసి కులాలు ఇలాంటివి వున్నాయి.

ఎప్పుడయితే ఆర్థికంగా బలంగా వుంటారో? వాళ్లు క్రైస్తవ మతంలోకి ఇట్టే మారిపోవడం అన్నది సాధ్యంకాదు. మార్చేయడం అంతకన్నా సాధ్యం కాదు. ఈ సంగతి ఇలా వుంచితే, జగన్మోహన రెడ్డి తనపై వున్న క్రైస్తవ ముద్రను చెరిపేయాలనే ప్రయత్నాన్ని చిరకాలంగా ప్రయత్నిస్తున్నారు. చాలావరకు ఆ విషయంలో విజయం సాధించారు. ఎన్నికల టైమ్ లో ఆయనపై రెండు రకాల ప్రచారం జరిగింది.

ఒకటి ఆయన క్రైస్తవుడని.
మరొటి ఆయన హిందూత్వలోకి మారారని.
ఈ విధంగా ఆయన ఓటు బ్యాంక్ ను వీక్ చేయాలన్న ప్రయత్నాన్ని ప్రత్యర్థులు చేసారు.

ఇప్పుడు ఆర్కే కొత్త స్ట్రాటజీ అందుకున్నారు. అదేమంటే భాజపాను వైకాపాకు దూరం చేయడం. గతంలో ఆయన నానారాతలు రాసి తెలుగుదేశానికి-భాజపాకు మధ్య దూరం పెంచారు. ఆ విధంగా తెలుగుదేశం పరాజయానికి ఆయనే కారకులయ్యారు. ఇది ఆరోపణ కాదు, తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో వున్న స్థిర అభిప్రాయం. బాహాటంగా చెప్పడం లేదంతే. ఇప్పుడు అదే స్ట్రాటజీని భాజపా-వైకాపా మధ్యలో అమలు చేయాలనుకుంటున్నారు.

ఆంధ్రలో హిందూత్వకు ఏదో అయిపోతోంది అనే సీన్ క్రియేట్ చేస్తే, అర్జంట్ భాజపా జనాలు రెచ్చిపోయి, ఏదో ఒకటి చేసేస్తారన్నది ఆర్కే ప్లాన్ గా కనిపిస్తోంది. నిజానికి గత నెలరోజులుగా జగన్మోహన రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగుదేశం శ్రేణులకు మింగుడు పడడం లేదన్నది వాస్తవం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడం అన్నది లక్ష కుటుంబాలను ప్రభావితం చేసే అంశం. 27శాతం ఐఆర్ ఇవ్వడం అన్నది ఉద్యోగులను ఆకట్టుకునే విషయం.

ఉద్యోగులు ఇప్పటికి ఒకే ఒకసారి 2014లో బాబుతో వున్నారు. వారు ఎప్పటికీ బాబుకు దూరమే. ఎందుకంటే బాబుగారికి ఉద్యోగులు అంటే ఎందుకో నచ్చదు. అందరికీ తాయిలాలు ఇస్తారు కానీ, ఉద్యోగులకు ఇవ్వరు. ఇది ఆ వర్గానికి బాగా తెలుసు. ఆర్టీసీ ఉద్యోగులును ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం. ఇది కూడా ఓ అద్భుతమైన విషయం. ఇక ఆర్టీసీ ఉద్యోగుల విశ్వాసం ఎవరి వైపు వుంటుంది?

అయితే ఈ విషయాలు మరుగున పెట్టి కులాల గేమ్ కు తెరతీస్తున్నారు ఆర్కే. మొన్నటి ఎన్నికల్లో ఎవరైతే తెలుగుదేశాన్ని వదిలిపెట్టి, వైకాపాకు మద్దతు పలికారో, ఆ బిసిల్లో హిందూత్వ, క్రిస్టియానిటీ ఫీలింగ్ తీసుకురావాలనే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా రెండు ప్రయోజనాలు ఆర్కే ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఒకటి బిసిల్లో చీలిక తీసుకురావడం, హిందూత్వ భావాలు రెచ్చగొట్టడం.
రెండు భాజపాను వైకాపా మీదకు ఉసి కొల్లడం.

హోదా తకరారు

ఇక్కడ ఆర్కే గమనించాల్సిన విషయం ఒకటి వుంది. 2024 నాటికి కూడా హోదా విషయం సజీవంగానే వుంటుంది. కేంద్రం ఏదో విధంగా జగన్ కు సాయం చేయడం కోసం, ఆయనను ఎన్టీఎలో చేర్చుకోవడం కోసం హోదా ఎంతో కొంత ఇస్తే అది జగన్ కే మేలు అవుతుంది. లేదూ, హోదా ఇవ్వలేదు అంటే భాజపాతో జగన్ మాత్రమే కాదు, టీడీపీ కూడా కలిసి వెళ్లలేదు. టీడీపీ అలా వెళ్తే అది కూడా జగన్ కు ప్లస్ అవుతుంది.

ఇక భాజపా-టీడీపీ విషయానికి వస్తే, పొత్తు విశ్వసనీయతలో వైకాపాను నమ్ముకోవడం బెటర్ అని భాజపాకు తెలుసు. బాబుగారి యూ టర్న్ లు ఇన్నీ అన్నీ కావు అని అందరికీ తెలుసు. అదే మోడీకి తెలుసు. కానీ జగన్ యుపిఎ వైపు ఎప్పటికీ వెళ్లరనీ తెలుసు. అప్పుడు ఎవరు ప్రయారిటీ అవుతారు?

''... ‘‘మనవాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక మన చర్చిలను అభివృద్ధి చేస్తాడు’’ అని ఏపీలోని క్రైస్త్తవులకు చర్చి ఫాదర్స్‌ చెబుతున్నారు. ఏపీలో క్రైస్తవ మతం ఎంత వ్యాప్తి చెందితే జగన్మోహన్‌రెడ్డికి రాజకీయంగా అంత లాభం. జగన్మోహన్‌రెడ్డి అనుసరించబోయే ఈ వ్యూహాన్ని బీజేపీ ఎలా ఎదుర్కోబోతున్నదో వేచిచూడాలి..''

ఇది కూడా ముందే చెప్పుకున్నట్లు భాజపా, ఆరెస్సెస్ తదితర హిందూత్వ సంస్థలను వైకాపాకు వ్యతిరేకంగా ఎగసం తోయడం మినహా మరేమీకాదు. హిందువుల విషయంలో, అర్చకుల విషయంలో, బ్రాహ్మణుల విషయంలో, ఇలా చాలా విషయాల్లో జగన్ చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా, పాలనా పరంగా బ్రాహ్మణులకు పెద్ద పీట వేసారు.

బ్రాహ్మణులను దూరంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం. భాజపాకు మద్దతుగా నిలిచేది ఈ వర్గమే. అందువల్ల ఆర్కే చేసే ఇలాంటి జిమ్మిక్కులు అంతగా వర్కవుట్ కావనే అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తెలుగు వార్తలను తర్జుమా చేసి, భాజపా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేది ఆ పార్టీ నాయకులే. ప్రస్తుతం వున్న భాజపా నాయకులంతా జగన్ మోహన్ రెడ్డి వైపే వున్నారు.

కంభంపాటి హరిబాబు, పురంధ్రీశ్వరి, కామినేని శ్రీనివాస్ లాంటి ఒక వర్గం నాయకులంతా ఇప్పడు ఎక్కడ వున్నారో కూడా తెలియదు. వెంకయ్య నాయుడు ను రాజ్యాంగ బద్ద పదవిలో కూర్చోపెట్టిన తరువాత భాజపాలో ఆ వర్గం వైభవం ముగిసిపోయింది. అందువల్ల తేదేపా ప్రయత్నాలు, దాని కోసం ప్రయత్నించే కాలమిస్టుల కలలు నెరవెరడం అంత సులువు కాదు.
-ఆర్వీ

బాబుపై కేసుల విచారణకు ఇక అవరోధాలు లేవు